ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో 'ఛఠ్ పూజ' వేడుకలు శనివారంతో పూర్తయ్యాయి. ఉదయించే సూర్యభగవానుడికి పూజలు చేసి ఈ ఉత్సవాలకు ముగింపు పలికారు. నదీతీర ప్రాంతాల్లో చివరిరోజు సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు భక్తులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సూర్యుడికి ప్రత్యేక పూజలు చేశారు.



బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ఉత్సవాల్లో పాల్గొని సూర్య భగవానుడికి పూజలు చేశారు. ఝార్ఖండ్‌లోని రాంచీ, బిహార్‌లోని పట్నాలో, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలోని చాలా మంది భక్తులు నదీ ఘాట్ల వద్ద ఛఠ్‌పూజ నాలుగో రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కరోనా ప్రభావం వల్ల ఈసారి చాలా మంది ఇళ్ల వద్దే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.



లఖ్‌నవూలోని గోమితి నదీ భక్తజనంతో నిండిపోయింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు.




ముంబయి, దిల్లీ, భువనేశ్వర్లలోనూ ఛఠ్ పూజ చివరి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.



రాంచీలోని హతానియా తలాబ్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ సుబోధ్ కాంత్ సహాయ్ పాల్గొన్నారు. 'ప్రజల నమ్మకాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం సంతోషకరం. అనేక నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం పూజల్లో పాల్గొన్నారు. అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తున్నార'ని అన్నారు.

బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి ఏటా వైభవంగా 'ఛఠ్ పూజ' ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసం శుక్ల పక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్ పూజలు చేస్తారు. చివరిరోజున తెల్లవారు జామున ఉదయించే సూర్యుడికి పూజలు చేయటంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చూడండి:కన్నుల పండుగలా 'ఛఠ్ పూజ' ఉత్సవాలు