12వ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలు రద్దయిన నేపథ్యంలో వారికి గ్రేడ్ల కేటాయింపుపై 13 మంది సభ్యులతో ఒక కమిటీని సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. విద్యార్థుల ఉత్తీర్ణత స్థాయిని నిర్ణయించేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాలను రూపొందించనుంది ఈ కమిటీ. 10 రోజుల్లో తన నివేదిక సమర్పించనుంది. నిర్ధిష్ట సమయంలో ఫలితాలను విడుదల చేసేందుకు అత్యున్నత ప్రమాణాలను పాటించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ కంట్రోలర్ భరద్వాజ్ పేర్కొన్నారు.
కొవిడ్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా.. వివిధ వర్గాల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రద్దు చేసింది సీబీఎస్ఈ.
రద్దైన ఎన్‌ఐఓఎస్ పరీక్షలు..
కొవిడ్-19 మహమ్మారి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎన్‌ఐఓఎస్ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. ఈ నిర్ణయంతో సుమారు 1.75 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థుల ఉత్తీర్ణతను అంచనా వేసేందుకు త్వరలో ఆబ్జెక్టివ్ ఆధారిత ప్రమాణాలను ప్రవేశపెట్టనున్నాం."
-రమేశ్ పోఖ్రియాల్ , కేంద్ర విద్యాశాఖ మంత్రి
నూతన మూల్యాంకన విధానంలో తమకు అన్యాయం జరిగిందని భావించే విద్యార్థులకు పరిస్థితులు కుదుటపడిన అనంతరం పబ్లిక్ ఎగ్జామినేషన్ లేదా ఆన్-డిమాండ్ ఎగ్జామినేషన్ (ఓడీఈ)లో హాజరయ్యేందుకు అవకాశం ఇస్తామని ఎన్‌ఐఓఎస్ డైరెక్టర్ ఎస్.కే ప్రసాద్ తెలిపారు.
ఇవీ చదవండి: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు