ఓ వ్యక్తి రూ. 7.50 లక్షలు ఖర్చు చేసి కారును హెలికాప్టర్‌గా మార్చారు. అయితే ఇది ఎగరకపోయినా పెళ్లిలో వధూవరుల ఊరేగింపులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది. హెలికాప్టర్ రూపంలో ఉన్న ఈ కారుకు.. విపరీతమైన డిమాండ్ ఉంది. బిహార్ కైమూర్ జిల్లాలోని మెహనియా ప్రాంతానికి చెందిన.. అమర్నాథ్ కుమార్ గుప్తా అనే వివాహ నిర్వాహకుడు తన కారును హెలికాప్టర్‌గా మార్చాడు.
"ఈ హెలికాప్టర్ కారును ముంబయిలో ప్రత్యేకంగా తయారు చేయించాను. దీనికోసం 8 నెలలు కష్టపడ్డి.. రూ.7.50 లక్షలు ఖర్చు చేశాను. ఈ కారును నవంబర్ 25 నుంచి వివాహాల కోసం అందుబాటులోకి తీసుకువస్తాను. ఇప్పటికే డిసెంబర్ 22 వరకు ఈ కారు బుక్ అయ్యింది. దీనికి ఒక్కసారికి రూ.7,000 అద్దె తీసుకుంటాను. అదనపు ఖర్చులు వాళ్లే భరించాలి. ప్రస్తుతం దీని కోసం పక్క జిల్లాల నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి"
-అమర్ నాథ్ కుమార్ గుప్తా, కారు యజమాని
అమర్నాథ్.. 8 నెలల పాటు శ్రమించి తన కారును ప్రత్యేకంగా తయారుచేయించారు. పెళ్లిలో వధూవరుల ఊరేగింపు కోసమే దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించానని చెప్పారు. ఈ కారు అచ్చం హెలికాప్టర్లానే కనిపిస్తుంది కానీ పైకి ఎగరలేదని.. అయినా సరే వివాహాల సీజన్లో దీనికి అధిక డిమాండ్ ఉందని కారు యజమాని తెలిపారు. హెలికాప్టర్లా కనిపించే ఈ కారును 'దుల్హన్ చాలీ ససురల్' గా పిలుస్తున్నారు. అంటే వధువును తన అత్తామామల ఇంటికి తీసుకువచ్చే వాహనం అని అర్ధం.