కరోనా మహమ్మారి విజృంభణ వేళ.. కొవిడ్ రోగుల చికిత్స కోసం కొన్ని ప్రాంతాల్లోని అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. పడకలు, ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటకలో..
కరోనా బాధితులకు అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు నగర మహాపాలిక(బీబీఎంపీ).. ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో 'ఆక్సిబస్' సేవలను ప్రారంభించింది. ప్రతి బస్సులో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసింది.
"ఈ 'ఆక్సిబస్'లో 6 నుంచి 8 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి 20 ఆక్సిబస్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వీటిని బెంగళూరులోని కొవిడ్ చికిత్స కేంద్రాలు, ఆస్పత్రుల వద్ద నిలుపుతాం. ప్రతి ఆక్సిబస్లో ఒకేసారి 8 మంది రోగులకు చికిత్స అందించవచ్చు.ఈ సేవలను ఉచితంగానే అందిస్తాం."
-గౌరవ్ గుప్తా, బీబీఎంపీ చీఫ్ కమిషనర్.
హరియాణాలో..
హరియాణాలోని పంచకులా డిపోలో ఐదు మినీబస్సులను అంబులెన్సుగా మార్చారు అక్కడి అధికారులు. ప్రతి బస్సులో 4 పడకలు, రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. డ్రైవర్‌తో పాటు పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది ఈ బస్సులో ఉంటారని పంచకుల డిపో మేనేజర్ వినయ్ కుమార్ తెలిపారు.
చెన్నైలో..
తమిళనాడు చెన్నై అన్నానగర్‌లోని జావీద్ మసీదును క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. కొవిడ్ నెగెటివ్ వచ్చినప్పటికీ.. కొన్నాళ్లపాటు క్వారంటైన్లో ఉండాల్సినవారి కోసం దీన్ని ఏర్పాటు చేశారు.
దిల్లీలో..
దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ పడకలను అక్కడి అధికారులు బుధవారం ప్రారంభించారు.
ఇదీ చూడండి: అలా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి!
ఇదీ చూడండి: 'భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా.. 44దేశాల్లో'