పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాక ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లాలో ఓ విహహం వింత కారణంతో అర్థాంతరంగా ఆగిపోయింది. వరుడి ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన వధువు.. అతడ్ని రెండో ఎక్కం చెప్పమని అడిగింది. దీనికి పెళ్లికొడుకు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అతడ్ని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. వరుడి మెడలో వేయాల్సిన పూలమాలను విసిరేసింది.


పెళ్లి జరిపించేందుకు రెండు కుటుంబాలు పలుమాలు చర్చలు జరిపాయి. అయినా పెళ్లి కూతురు తన మనసు మార్చుకోలేదు. ఇక చేసేదేమీ లేక వరుడి కుటుంబం వధువు ఇంటి నుంచి వెళ్లిపోయింది.

పెళ్లికూతురు మహోబాలోని బల్లయాన్ గ్రామానికి చెందిన రతిరాం అహిర్వార్ కుమార్తే మాయ కాగా.. పెళ్లికొడుకు ధావర్ గ్రామానికి చెందిన రంజిత్ అహిర్వార్ కుమారుడు.
పెళ్లి రద్దయ్యాక వివాహ ఏర్పాటుకు అయిన ఖర్చును వరుడి కుటుంబమే చెల్లించాలని వధువు కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం గమనార్హం.