Boy killed Due to Illegal Affair: వివాహేతర సంబంధాల మోజులో పడి చాలా మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటూ.. పక్కవారి జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను భర్త చంపగా.. భర్త అడ్డుగా ఉన్నాడని అంతమొందించిన భార్య.. ఇలాంటి వార్తలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కుమారుడిని అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన అన్నమయ్య జిల్లాలో స్థానికంగా సంచలనం రేపింది.
అభం శుభం తెలియని బాలుడు.. ఆపై మాటలు రాని మూగవాడు.. గోడకేసి తలను బాదుతున్న తన బాధను వ్యక్తపరచలేని నిస్సహాయుడు. ఆ చిన్నవాడి మౌన వేదన ఆ తల్లి హృదయాన్ని కరిగించలేకపోయింది.. కన్నతండ్రి కాకపోయినా ఆ స్థానంలో ఉన్న ఆ కిరాతకుని హృదయాన్ని కూడా మార్చలేకపోయింది. చివరకు ఆ సంబంధం బాలుడిని బలిగొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నందలూరు మండలం అరవపల్లికు చెందిన అబ్దుల్లాకు జహీరున్నిసాతో వివాహం అయింది. వీరిద్దరికి షాహిద్ అనే ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతడికి మాటలు రావు.. పుట్టుకతోనే మూగవాడు.
అయితే జహిరున్నిసా.. కర్నూల్ జిల్లా చాగలమర్రి ఎమ్మార్వో కార్యాలయంలో పని చేస్తున్న లక్ష్మణ్ అనే ఓ ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు దూరంగా కుమారుడితోనే చాగలమర్రిలో నివాసం ఉంటుంది. తమకి అడ్డు వస్తున్నాడని జహిరున్నిసా, ఆమె ప్రియుడు లక్ష్మణ్ తరచూ బాలుడిని వేధించేవారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం బాలుడిని అతికిరాతంగా వేధించి ఒంటిపై వాతలు కూడా పెట్టారు. దీనిపై నందలూరు పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా జరిగింది. ఇకపై పిల్లాడిని వేధించమని తల్లి జహీరూన్నిసా, ప్రియుడు లక్ష్మణ్‌లు.. పోలీసులకు చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం షాహిద్‌ను ప్రియుడు లక్ష్మణ్ తల గోడకేసి బాది కిరాతకంగా హింసించి చంపాడు.
అయితే ఏమి తెలియనట్లు పై నుంచి కింద పడిపోయాడని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై విచారణ చేసి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆ రిపోర్టులో కింద పడి చనిపోలేదని.. బాగా కొట్టి హింసించడం వల్ల చనిపోయినట్లు తెలిపారు. దీంతో పోలీసులు లక్ష్మణ్‌ను విచారించగా అసలు విషయం వెలుగులోకి రావడంతో అతడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా బాలుడి తల్లిని కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాలుడిని అతికిరాతకంగా చంపిన లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి అబ్దుల్‌తో పాటు స్థానికులు కోరుతున్నారు.