కేరళలో భారతీయ జనత పార్టీ అధికారమే లక్ష్యంగా శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పు- తదనంతర పరిణామాలతో పాటు లవ్ జిహాద్‌ను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోంది. ఓ వర్గం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా లవ్ జిహాద్ చట్టం కూడా తెస్తామని.. ఇప్పటికే ఎన్డీఏ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. కోన్ని నియోజకవర్గంలో శబరిమల అంతర్భాగం కాగా.. అక్కడి నుంచి భాజపా కేరళ అధ్యక్షుడు కే సురేంద్రన్ బరిలో దిగారు.
వారు ఉన్నంతకాలం సురక్షితం కాదు
శబరిమలలో మహిళల ప్రవేశం విషయంలో సీపీఎంతో పాటు ముఖ్యమంత్రి పినరయి విజయన్.. రెచ్చగొట్టే దోరణిలో వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంపై కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధపడినా.. ముఖ్యమంత్రి పినరయితో పాటు ఆ పార్టీ సీనియర్ నేత సీతారామ్ ఏచూరి అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా.. శబరిమల దివ్యక్షేత్రం కాస్తా ఆందోళనలకు కేంద్రబిందువుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో వామపక్షాలు ఉన్నంతకాలం..శబరిమల క్షేత్రం సురక్షితం కాదని భాజపా వ్యాఖ్యానిస్తోంది.
ప్రజల విశ్వాసాలను వెంటాడుతూనే ఉంటామంటూ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని భాజపా నేతలు చెబుతున్నారు. శబరిమల విధ్వంసమే పినరయి లక్ష్యంగా మారిందని దాన్ని మళ్లీ ఓ రణరంగంగా మార్చాలని చూస్తున్నారని భాజపా ఆరోపిస్తోంది. లవ్ జిహాద్‌పై పినరయితో పాటు సీపీఎం పార్టీ నేతలు వారి నిర్ణయం ఏంటన్నది ప్రకటించాలని... ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. పినరయి దేశద్రోహులతో కలిసి ఐదేళ్లు ప్రభుత్వాన్ని పంచుకున్నారని కూడా భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు వ్యక్తులతో పినరయి సమావేశాలు నిర్వహించడమే అతి పెద్ద తప్పని.. ఆయన చర్యల ఫలితంగా కేరళ పట్టపగలే దోపిడీకి గురవుతోందని కమలనాథులు మండిపడుతున్నారు. ఈఎంసీసీ డీల్‌తో ప్రభుత్వ అవినీతి చిట్టా బయటకు వచ్చిందని చెబుతోంది. సభాపతి అయితే.. ఆ స్థానానికే మచ్చ తెచ్చారని విమర్శిస్తున్నారు.
లెఫ్ట్ కార్యకర్తల్లా అధికారులు..
పోస్టల్ ఓట్లలోనూ భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. బూత్ స్థాయి అధికారులు సీపీఎం కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘం ఆదేశాలు ఖాతరు చేయడం లేదని భాజపా చెప్తోంది. ఎన్నికల సంఘం ఏవిధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ ఈసీపైనా మండిపడుతోంది. యూపీలోని ఝాన్సీలో నన్‌లపై జరిగిన దాడివిషయంలో పినరయి అసత్య ప్రచారం చేస్తున్నారని భాజపా తెలిపింది. ఆ ఘటన జరిగిన వెంటనే యూపీ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకున్నారని కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌గోయెల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'వాజే నియామకంపై ఎప్పుడో హెచ్చరించా'