రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశ ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరుకున్నాయి. రజనీ ప్రకటనతో పాటు అధికార అన్నాడీఎంకే పార్టీకీ మరో వార్త.. తలనొప్పిగా మారింది. అన్నాడీఎంకే పార్టీతో పొత్తు విషయంలో భాజపా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ శుక్రవారం పేర్కొనడం చర్చనీయాంశమైంది.
'అన్నాడీఎంకేతో పొత్తుపై ఏ విషయం ఖరారు కాలేదు. దీనిపై నిర్ణయాధికారం జాతీయ నాయకత్వానిదే' అంటూ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మురుగన్ శుక్రవారం పేర్కొన్నారు. రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకొనే విషయంపైనా సానుకూలంగానే స్పందించారు.
'ఎన్డీఏదే అధికారం'
2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. భాజపా సైతం ఇదే తరహాలో ఆలోచిస్తోంది. రజనీ రాజకీయ ప్రవేశం తమకు లాభించేదే అని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై పునరాలోచనలో పడింది. రాష్ట్రంలో ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే భాజపా చేస్తున్న ప్రకటనలు అన్నాడీఎంకేకు రుచించడం లేదు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళనాడులో పోటీ చేసింది భాజపా. అయితే ఇందులో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఒక్క సీటు దక్కించుకోవడంలోనూ విఫలమైంది. ఓట్లు కూడా రెండు శాతానికి అటు ఇటుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుపై భాజపా యూ-టర్న్ తీసుకోవడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
![BJP leaves AIADMK red-faced: Rethinks on alliance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9775782_modi_eps1_0412newsroom_1607088989_665-1.jpeg)
అప్పుడు సానుకూలమే
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో తమిళనాడులో పర్యటించినప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు ఖరారైనట్లేనని అందరూ భావించారు. కూటమి విషయంలో అమిత్ షా సానుకూలంగానే వ్యవహరించారు. విపక్ష డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కలిసికట్టుగానే పోటీ చేస్తామని పళనిస్వామి, పన్నీర్‌సెల్వం సైతం ప్రకటించారు.
![BJP leaves AIADMK red-faced: Rethinks on alliance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9775782_modi_eps1_0412newsroom_1607088989_665-2.jpg)
కానీ, రజనీ ప్రకటనతో భాజపా పునరాలోచనలో పడింది. పొత్తులపై సమీక్షలు నిర్వహించుకుంటోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సీట్ల కోసమే పథకం!
అయితే కూటమిలో భాగంగా ఎక్కువ సీట్లలో పోటీ చేయడానికే ఈ వ్యూహాన్ని భాజపా ముందు వేసుకుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
![BJP leaves AIADMK red-faced: Rethinks on alliance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9775782_rajini_modi1_0412newsroom_1607088989_393-1.jpg)
"రజనీకాంత్‌ను తమ ముఖచిత్రంగా ఉంచుతూనే.. అన్నాడీఎంకే నుంచి ఎక్కువ సీట్లు దక్కించుకునేందుకు భాజపా ఈ వ్యూహాన్ని రచించి ఉండొచ్చు. ఆ ఉద్దేశంతోనే రజనీకాంత్ పేరును ఉపయోగించి ఉండొచ్చు. అది కాకుండా.. ఆ నటుడికి ఎలాంటి ఓటు బ్యాంకు ఉంది? అతనిపైనే ఆధారపడితే భాజపాకు ఎదురుదెబ్బ తగలొచ్చు. అన్నాడీఎంకే అనేది పటిష్ఠ మూలాలున్న పార్టీ. రజనీకాంత్‌కు అభిమాన సంఘాలు మాత్రమే ఉన్నాయి."
-ప్రొఫెసర్ రాము మణివన్నన్, మద్రాసు యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెడ్
పొత్తుల విషయంలో రజనీకాంత్ జాగ్రత్తగా ఉండాలని రాజకీయ విశ్లేషకుడు రవీంద్రన్ దురైస్వామి పేర్కొన్నారు. 'ఇప్పటివరకైతే కూటమిపై రజనీకాంత్ స్పందించలేదు. పళనిస్వామి, మురుగన్‌లు పొత్తు పెట్టుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకోవాలి' అని అన్నారు.
![BJP leaves AIADMK red-faced: Rethinks on alliance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9775782_rajini_modi1_0412newsroom_1607088989_393-2.jpg)
ఈ పొత్తుల మాటలు ఎలాగున్నా.. పార్టీ పెడుతున్నానన్న ఒక్క ప్రకటనతోనే ద్రవిడ దేశంలో రాజకీయ వేడి పుట్టించారు తలైవా.