పార్థివదేహాలకు త్రివిధ దళాల అధినేతల నివాళులు
తమిళనాడు కూనూర్‌లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది భౌతికకాయాలకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. దిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌లో ఉంచిన పార్ధివదేహాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. సైన్యానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం.. అమరుల కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం వీరులకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో పాటు., ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణె, నావికదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, వైమానిక దళ చీఫ్ మార్షల్ వీఆర్ ఛౌదరి నివాళులు అర్పించారు. అటు రక్షణశాఖ కార్యదర్శి, ఆర్మీ, వైమానిక, నావిక దళాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు అమరులకు పుష్పాంజలి ఘటించారు.