కొవిడ్-19కు సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను డెవలప్ చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతిఒక్కరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. కొన్ని కార్యాలయాల్లో విధులకు హాజరుకావాలంటే ఈ యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. గ్రేటర్ నొయిడా పరిధిలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వినియోగదారులు ఆరోగ్యసేతు యాప్ లేకుండా బయట తిరగడం నేరం. శిక్షార్హులు కూడా అని పోలీసులు ప్రకటించారు. అంతేకాదు, రూ.1,000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష తప్పదు. ఇక మాస్క్‌లేకుండా రోడ్డుపైకి రావడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
‘స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆరోగ్యసేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోవడాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నాం. అది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించినట్లు అవుతుంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా కట్టాల్సిందే. ఫేస్‌మాస్క్‌లేకపోయినా శిక్ష తప్పదు’ అని అదనపు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ ద్వివేది తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారందరూ ఆరోగ్యసేతు యాప్‌డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.
ఇదీ చూడండి:అమ్మాయిలపై అసభ్య చర్చలకు గ్రూప్.. దిల్లీలో నిర్వాకం