దేశరాజధాని దిల్లీలోని ప్రముఖ పాఠశాలలకు చెందిన కొందరు టీనేజ్ విద్యార్థులు మహిళల, బాలికల పట్ల అసభ్యకర అంశాలను చర్చించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గ్రూప్ ఏర్పాటుచేశారు. బాలికల అశ్లీల చిత్రాలు, అసభ్య రాతలను పోస్ట్ చేసేందుకు 'బాయిస్ లాకర్ రూమ్' (Bois Locker Room) పేరుతో గ్రూపు ఏర్పాటుచేశారు. అత్యాచారం వంటి అంశాలపై ఈ గ్రూపులో చర్చలు నడుస్తున్నాయి.
ఫలానా అమ్మాయిని అందరం కలిసి అత్యాచారం చేద్దాం వంటి మాటలు ఈ సంభాషణల్లో ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కడం వల్ల దిల్లీవాసులు భగ్గుమన్నారు. గ్రూప్ ఏర్పాటుచేసిన వారిలో కొందరి వయసు కేవలం 13 సంవత్సరాలే కావడం మరింత ఆందోళనకరం. కొన్నాళ్లుగా ఈ గ్రూప్‌లోని సభ్యులు బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం, అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్క్రీన్‌షాట్‌లను ఓ బాధితురాలు బయట పెట్టడంత వల్ల సామాజిక మీడియాలో చర్చ మొదలైంది.
అదే సమయంలో నగ్న చిత్రాలను బయటపెడతామంటూ గ్రూపు సభ్యుల నుంచి హెచ్చరికలు సైతం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరాదని దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు.