కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన కర్ణాటక రాజకీయ సంక్షోభంలో మరో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్ప... నేడు శాసనసభలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయపడినప్పటికీ... బలపరీక్షలో తప్పకుండా నెగ్గుతామని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం జరిగిన భాజపా శాసనసభా పక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన యడ్డీ... బల నిరూపణలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక బిల్లును యథావిధిగా సభలో ప్రవేశపెడతామన్నారు.
"శాసనసభ సమావేశంలో సోమవారం అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించాం. బల పరీక్షలో గెలిచి ఆర్థిక బిల్లును సభలో ప్రవేశ పెడతాం. బిల్లుకు కాంగ్రెస్- జేడీఎస్ మద్దతిస్తాయని ఆశిస్తున్నా."
--- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
స్పీకర్ నిర్ణయంతో మరింత ఉత్కంఠ
బలపరీక్షకు ఒక్క రోజు ముందు కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠను మరింత పెంచింది.
ఈ నెల 25న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేశారు సభాపతి. స్పీకర్ తాజా నిర్ణయంతో 224 సీట్లు ఉండే కర్ణాటక విధాన సౌధాలో 17 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. ఒక నామినేటెడ్ సభ్యుడిని కలిపితే మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుతుంది.
భాజపా గట్టెక్కడం ఖాయం!
యడియూరప్ప ప్రభుత్వం సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటే 104 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం ఆ మ్యాజిక్ ఫిగర్‌ను ముఖ్యమంత్రి అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపితే భాజపా బలం 106కు చేరుతుంది.
కాంగ్రెస్- జేడీఎస్ సభ్యులు...
అనర్హతవేటుకు గురైన ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్ బలం 78 నుంచి 65కు పడిపోతుంది. జేడీఎస్ బలం 37 నుంచి 34కు తగ్గుతుంది. మొత్తంగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలం 99 దగ్గరే ఆగిపోనుంది.
జేడీఎస్ ఎటువైపు?
కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేల వల్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కాషాయ పార్టీకి మద్దతునివ్వాలని కొందరు జేడీఎస్ నేతలు ప్రతిపాదించారు. వారి ప్రతిపాదనను మరికొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సోమవారం బలపరీక్షలో జేడీఎస్ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా అసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:- రూ.10 కోట్ల పారితోషికం వదులుకున్న నయన్