ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భాజపా తరఫున ఆయనపై ఎన్నికల బరిలో ఉన్న సినీనటి జయప్రదపై ఓ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
"ఆమెను (జయప్రద) రామ్‌పుర్‌కు నేనే తీసుకువచ్చాను. ఆమె జోలికి ఎవరూ రాకుండా నేను చూసుకున్నాను. అందుకు మీరే సాక్ష్యం. రాంపుర్, ఉత్తర్‌ప్రదేశ్, దేశ ప్రజలకు ఆమె నిజస్వరూపం తెలియడానికి 17 ఏళ్లు పట్టింది. నేను మాత్రం 17 రోజుల్లోనే కనిపెట్టాను......"
-ఆజంఖాన్, ఎస్పీ సీనియర్ నేత
ఆజంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపింది.
పోటీకి అనర్హులు..
ఆజంఖాన్ లక్ష్మణ రేఖ దాటేశారని, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన అనర్హులని జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మహిళగా నేను ఆ మాటలు తిరిగి చెప్పలేను. ప్రతిగా అలాంటి పదజాలాన్ని వాడలేను. ఆయన ఎన్నికల పోటీలో ఉండకూడదు. ఆయనను ఎన్నికల నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే ఇలాంటి వారు గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? సమాజంలో మహిళలకు స్థానం దక్కదు. మేము ఎక్కడికి వెళ్లాలి? నేను చచ్చిపోవాలా? అప్పుడు మీకు ఆనందమా? ఇలాంటి మాటలకు భయపడి నేను రాంపుర్ వదిలి వెళ్తానని అనుకుంటున్నారా? నేను వెళ్లను. ఆజంఖాన్.. వినండి.. ఎన్నికల్లో నేను గెలిచాక చెప్తా... జయప్రద అంటే ఏంటో. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో తల్లి లేదా? "
-జయప్రద, సినీనటి, రాంపుర్ భాజపా అభ్యర్థి
రుజువు చేస్తే తప్పుకుంటా..
వివాదంపై స్పందించిన ఆజంఖాన్ తాను ఎవరినీ ఉద్దేశించేలా వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని మండిపడ్డారు. తాను ఎవరి పేరైనా ప్రస్తావించి మాడ్లాడినట్టు నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.
"నేను ఎవరి పేరు ప్రస్తావించలేదు. నాకు తెలుసు ఎలా మాట్లాడాలో. నాకు తెలుసు మీడియాకు నేనంటే అసలు నచ్చదు. నేను ఎవరి పేరైనా ప్రస్తావించి వారిని కించపరిచేలా మాట్లాడానని నిరూపిస్తే... ఎన్నికల నుంచి తప్పుకుంటా."
- ఆజంఖాన్, ఎస్పీ సీనియర్ నేత
జయప్రద సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2004, 2009లో రామ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. 2010లో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత నెలలో భాజపాలో చేరారు. ప్రస్తుతం రామ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఆజంఖాన్‌కు ప్రత్యర్థిగా బరిలో నిలిచారు.
- ఇదీ చూడండి: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు