ఉత్తర్ప్రదేశ్ బరేలీ జిల్లాలో దారుణం జరిగింది. భూత వైద్యురాలిగా చెప్పుకునే మోనీ అనే మహిళ.. అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రికి నయం చేయటానికి మూఢనమ్మకంతో సొంత అన్న భార్యపై కత్తితో దాడి చేసింది. ముఖం, శరీరంపై 101 సార్లు గాట్లు పెట్టి హింసించింది. వాళ్ల చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
అసలు ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాకు చెందిన మోనీ అనే మహిళ.. భూత వైద్యురాలిగా చెప్పుకుంటూ తాంత్రిక పూజలు నిర్వహిస్తోంది. అయితే.. గత కొంత కాలంగా తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భూత వైద్యం ద్వారా తన తండ్రికి నయం చేయాలని నిశ్చయించుకుంది మోనీ. మరొక వ్యక్తికి గాయపరచటం ద్వారా తండ్రి రోగాన్ని తగ్గించ వచ్చని భావించింది. ఈ చర్య కోసం తన అన్న భార్య రేణును ఎంచుకుంది. ఈ చర్యకు మోనీ భర్త మూలీ, ఆమె సోదరుడు రాజు సహయం చేశారు.
అనుకున్న ప్రకారం మంగళవారం రాత్రి.. రేణును ఇంటికి తీసుకొచ్చి ఆమె ముఖం, ఇతర శరీర భాగాలపై కత్తితో 101 సార్లు గాట్లు పెట్టారు. ఆపాలని ప్రయత్నించిన బాధితురాలి భర్త, అత్తగారిని గదిలో బంధించారు. నిందితుల చెర నుంచి ఎలాగోలా తప్పించుకొన్న రేణు పారిపోతూ.. కొంత దూరం పరుగులు తీసి పడిపోయి స్పృహ కోల్పోయింది.
గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. రేణును గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత తన వివరాలను తెలుసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
రేణు సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలైన మోనీని అరెస్టు చేశామని, ఆమె భర్త, సోదరుడు పరారీలో ఉన్నట్లు వివరించారు. రేణు ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:'విదేశీ బృందం పర్యటనపై ఆరోపణలు నిరాధారం'