కొవిడ్-19కు వ్యాక్సిన్లు జన సామాన్యంలోకి రావడానికి ఇంకా చాన్నాళ్లు పడుతుంది. ఈ ప్రక్రియలో మరింత ఆలస్యం జరిగితే ఏంటి పరిస్థితి? అప్పటివరకు వైరస్ వ్యాప్తిని ఆపే మార్గమే లేదా? ..ఈ ప్రశ్నలకు కొందరు చెబుతున్న సమాధానం "మంద రోగ నిరోధక శక్తి పెంపొందించడం (హెర్డ్ ఇమ్యూనిటీ)".
సహజ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువత, మధ్య వయస్కులకు వైరస్ సోకేలా చేసి వారి ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని సాధించాలనేది వారి వాదన. అయితే ఇది ప్రమాదకర పోకడ అని, ప్రస్తుతం ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఏమిటిది?
- జనాభాలో ఎక్కువ మందిలో రోగనిరోధక శక్తి పెంచగలిగితే అప్పుడు వ్యాధి వ్యాప్తి తగ్గిపోతుంది. అలా రోగ నిరోధక శక్తి లేనివారినీ కాపాడుకోవచ్చు. ఆ స్థితినే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అంటారు.
- ఇలా జరగాలంటే జనాభాలో కనీసం 80 శాతం పైగా ప్రజలకు వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఉండాలి. ప్రతి ఐదుగురిలో నలుగురికి వైరస్ సోకినా ఏమీకాకుంటే వారి నుంచి వైరస్ వ్యాప్తి జరగదు.
హెర్డ్ ఇమ్యూనిటీకి 2 మార్గాలు
- జనాభాలో 70-90 శాతం మందికి వైరస్ సోకి సహజ వ్యాధి నిరోధక శక్తితో దాన్ని జయించగలిగితే సాధ్యమవుతుంది (బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలుత ఇదే మాట అన్నారు. ఆయనే వ్యాధి బారిన పడ్డారు.)
- ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేసినా వస్తుంది. ఈ మార్గమే ఉత్తమం. సహజ పద్ధతిలో అయితే ప్రతిఒక్కరికి ఒకసారి ఆ వ్యాధి వస్తేనే దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. అలా వ్యాధి సోకినప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. పరిస్థితి విషమిస్తే ప్రాణాపాయం కూడా. అదే వ్యాక్సినేషన్ విధానంలో ఆరోగ్యాలకు భద్రత ఉంటుంది.
గత అనుభవాలు ఇవీ..
- తట్టు(మీజిల్స్), గవదబిళ్లలు, అమ్మవారు వంటి ఇన్‌ఫెక్షన్లు ఇప్పుడు చాలావరకు తగ్గిపోయాయి. ఇవి రాకుండా వ్యాక్సిన్లు విస్తృతంగా ఇవ్వడమే ఇందుకు కారణం. పోలియో విషయంలోనూ ఇదే రుజువైంది.
- ఇన్‌ప్లూయంజా వంటి వైరస్ కారక వ్యాధులకు వ్యాక్సిన్లు ఇస్తున్నప్పుడు శరీరంలో యాంటీబాడీస్ పెరిగి కొన్నాళ్ల పాటు ఆ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. అలాగే స్వైన్‌ప్లూ విషయంలో నార్వేలో వ్యాక్సిన్లతో కొంతవరకు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలిగారు.
- అలాగని అన్నిరోగాల వ్యాప్తిని అడ్డుకోవడంలో హెర్డ్ ఇమ్యూనిటీ పనిచేయదు. ఉదాహరణకు ధనుర్వాతం వ్యాక్సిన్ 95 శాతం మందికి పైగా వేసి ఉన్నా వాతావరణంలోని బ్యాక్టీరియా ద్వారా మిగతా 5 శాతం మందికి వచ్చే అవకాశం ఉంది.
కొవిడ్-19 విషయంలో ఎప్పుడు సాధ్యం?
- భౌతికదూరం పాటించడం, తరచూ చేతుల శుభ్రత.. ఈ రెండే ఇప్పటివరకు కొవిడ్ భారిన పడకుండా ఉన్న రక్షణ మార్గాలు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు హెర్డ్ ఇమ్యూనిటీని పెంచడం సాధ్యం కాదు. ఎందుకంటే.. వ్యాక్సిన్లు వేయడమే హెర్డ్ ఇమ్యూనిటీ పెంచుకొనేందుకు సురక్షిత మార్గం. కానీ ఇంతవరకు కొవిడ్‌కు వ్యాక్సిన్ తయారవలేదు.
- కరోనా వైరస్‌తో కొవిడ్-19 ఒకసారికి మించి వస్తుందా అన్నది శాస్త్రవేత్తలకే ఇంకా తెలియదు.
- బాధితుల్లో కొందరు తీవ్ర అస్వస్థతకు గురవుతుంటే కొందరు సాధారణంగానే ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో అంతుబట్టడం లేదు. ఇవేవీ తేలకుండా ప్రయోగం చేయడం కుదరదు.
కొవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే హెర్డ్ ఇమ్యూనిటీని అభివృద్ధి చేసుకోవచ్చు.