అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు భర్తను హత్య చేసింది ఓ మహిళ. అతడి మృతదేహాన్ని మాయం చేసేందుకు మాస్టర్ ప్లాన్ రచించింది. తన గేదె చనిపోయిందని.. దాన్ని పూడ్చేందుకు గొయ్యి తవ్వాలని జేసీబీని పిలిపించింది. చివరికి భర్త మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టింది. ఈ ఘటన కర్ణాటక బెళగావి జిల్లా నిప్పానిలోని హంచనల గ్రామంలో జరిగింది.
కర్రతో కొట్టి...
సచిన్- అనితకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత అనితకున్న అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు సచిన్. ఇదే విషయంపై వీరిద్దరు తరచూ గొడవపడేవారు. ఈ నెల 3న గొడవ మరింత తీవ్రమైంది. దీంతో భర్తను కర్రతో కొట్టి చంపేసింది భార్య.
అనంతరం ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఓ ప్రణాళికను రచించింది. వెంటనే జేసీబీని పిలిపించింది. తన గేదె చనిపోయిందని.. ఆ శవాన్ని పూడ్చిపెట్టాలని చెప్పి గొయ్యి తవ్వించింది. ఆ తర్వాత సచిన్ మృతదేహాన్ని ఆ గొయ్యిలో వేసి పూడ్చిపెట్టేసింది. ఆమె సోదరి, సోదరుడు, మరో వ్యక్తి కూడా అనితకు ఇందులో సహాయం చేశారు.
ఈ పూర్తి వ్యవహారాన్ని తెలుసుకున్న నిప్పాని గ్రామీణ పోలీస్ స్టేషన్ అధికారులు.. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:- ప్రేయసి భర్తను చంపి బావిలో పడేసిన ప్రియుడు