AAI Team For Airport plan in Kothagudem : కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి సరైన స్థలం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చూపిన స్థలాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించటానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) బృందాన్ని పంపిస్తామని వెల్లడించారు. రానున్న రెండు నెలల్లో ఆధ్యయనం చేసి వారిచ్చే నివేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి రామ్మోహన్‌నాయుడు వివరించారు.
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుపై ఆశలు రెక్కలు తొడుగుతున్నాయి. రామగుండం, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేస్తామని ఇటీవల వరంగల్‌లో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నాలుగేళ్లలో కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అధికారులు భద్రాద్రి జిల్లాలో మూడు మండలాల పరిధిలోని భూసేకరణపై ఓ అంచనాకు వచ్చారు.
ఇదీ జరిగింది
రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణ అంశం నలుగుతోంది. రేణుకాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో దీనిపై కొంతమేరకు కదలిక వచ్చి సుజాతనగర్ ప్రాంతంలో నిర్మించాలనుకున్నా ఆచరణకు మాత్రం నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత కూడా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక, పాల్వంచ మండలం గుడిపాడు-బంగారుజాల మధ్య విమానాశ్రయం ఏర్పాటుకు సర్వేలు చేసినా సానుకూల నిర్ణయాలు వెలువడలేదు. తాజాగా కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట్ చుట్టూ సుజాతనగర్, చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాలను ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సర్వే చేయాలని యోచిస్తున్నారు.
చేకూరే ప్రయోజనాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు, ప్రకృతి ప్రదేశాలు పర్యాటకులకు సులభంగా అందుబాటులోకి వస్తాయి.
- ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు నూతన పరిశ్రమలు, పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు వస్తాయి.
- లాజిస్టిక్స్, ఎగుమతులు, దిగుమతుల సదుపాయాలు మెరుగుపడి వ్యాపారాలు మరింతగా వృద్ధి చెందుతాయి.
- విమానాశ్రయ నిర్మాణం తర్వాత రవాణా వేగవంతమవుతుంది. అంతేకాకుండా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పడుతుంది.
- భవిష్యత్తులో కొత్తగూడెం ప్రాంతంలోని పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుంది.
- విమానాశ్రయం నిర్మాణంతో దీనికి సంబంధించిన సేవల ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
- విమానాశ్రయానికి అనుబంధంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర సదుపాయాలు అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
- విమానాశ్రయం ఏర్పాటుతో భద్రాద్రి జిల్లా అభివృద్ధి చెందిన ప్రాంతాల జాబితాలో చేరుతుంది. దీంతో ప్రభుత్వం ప్రాజెక్టులు, పథకాలు జిల్లా సమగ్ర ప్రగతికి మరింత దోహదపడుతుంది.
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు వస్తున్నాయ్! - వరంగల్‌తో పాటు ఎక్కడెక్కడంటే?
అడుగు పడింది - విమానం ఎగరనుంది - త్వరలోనే సాకారం కానున్న వరంగల్ వాసుల కల!