కరోనా వైరస్ మూలాల్ని నిగ్గుతేల్చేందుకు చైనాకు పంపాల్సిన అంతర్జాతీయ దర్యాప్తు బృందంలోని నిపుణల జాబితాను బీజింగ్‌కు అందజేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ విషయంలో చైనా ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు గురువారం వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ.
కరోనా మూలాలపై దర్యాప్తు చేయాలని ఈ ఏడాది మే నెలలో.. డబ్ల్యూహెచ్ఓ చేసిన తీర్మానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. భారత్ నేతృత్వంలో జరిగిన ఈ తీర్మానానికి చైనా కూడా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టులో చైనాను సందర్శించిన ఇద్దరు సభ్యుల బృందం.. జంతువులు, జలాశయాలపై దర్యాప్తు చేసేందుకు కావాల్సిన క్షేత్రస్థాయి ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ మిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా నిపుణులను ఎంపిక చేసినట్లు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ మైక్ రియాన్ తెలిపారు. చైనా నుంచి ఆమోదం లభించిన వెంటనే తదుపరి చర్యలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు మొదటి నుంచి విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.