భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై బంగాల్లో రాళ్ల దాడి చేసిన ఘటనలో ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు ఏడుగురిపై రెండు కేసులు పెట్టారు. అయితే షిరాకోల్, దెపీపుర్లో అల్లరిమూకను ప్రేరేపించారన్న ఆరోపణలతో భాజపా నేతల రాకేశ్ సింగ్‌పై ఎఫ్ఐర్ నమోదు చేశారు.
దాడి జరిగిందిలా..
గురువారం ఉదయం కోల్‌కతా నుంచి 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశానికి జేపీ నడ్జా వెళ్తుండగా సిరాకుల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటారుసైకిళ్లపై వచ్చిన దుండగులు ఇటుకలు, రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేస్తూ వెంబడించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అడ్డుకున్న పోలీసులతోనూ గొడవకు దిగారన్నారు. అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో బృందం సైతం ఇటుకలతో దాడికి పాల్పడిందని భాజపా నేతలు చెప్పారు. నడ్డా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. భాజపా నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ వర్గియాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. దాడి సమయంలో ఆందోళనకారులు మీడియాకు, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎవరెవరు ఏమన్నారు..?
- తృణమూల్ కార్యకర్తలే పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని బెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు.
- తృణమూల్ పాలనలో బెంగాల్‌లో దౌర్జన్యం, అరాచకం రాజ్యమేలుతున్నాయని అమిత్ షా ట్వీట్ చేశారు.
- భాజపా నేతల పర్యటనలో గురువారం శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తాను ముందుగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను అప్రమత్తం చేశానని, అయినా నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైందని గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నడ్డా పర్యటనలో ఉద్రిక్తత చెలరేగటంపై నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.
మాకేం సంబంధం..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. భాజపా నేతలకు ఇలాంటి నాటకాలు అలవాటేనన్నారు. ప్రతిరోజూ వాళ్లపై వాళ్లే దాడులు చేసుకోవడం, దాన్ని తృణమూల్‌పై నెట్టడం మామూలైపోయిందన్నారు. బలగాల రక్షణలో తిరుగుతున్న వాళ్లకు ఇంత భయమెందుకని ప్రశ్నించారు.