బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ చేసిన సైనిక దుస్సాహసం విజయవంతమై ఉంటే.. దాయాది సైనిక విభాగాల్ని తుడిచిపెట్టేద్దామనుకున్నామని నాటి వైమానిక దళాధిపతి బి.ఎస్.ధనోవా తెలిపారు. అందుకు భారత సేనలు అప్పటికే సిద్ధమయ్యాయని వెల్లడించారు. నాటి వైమానిక దాడుల్లో పాక్‌కు బందీగా పట్టుబడిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతకు ముందు ఆ దేశ నాయకులు వణికిపోయారని వచ్చిన వార్తల నేపథ్యంలో ధనోవా స్పందించారు. వర్ధమాన్‌ను అప్పగించడం తప్ప అప్పుడు పాక్‌కు మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
పాక్ నాయకుల కాళ్లు వణికి ఉంటాయి..
దౌత్యపరంగా, రాజకీయంగా పాకిస్థాన్‌పై విపరీతమైన ఒత్తిడి ఉండిందని నాటి పాక్ నిస్సహాయతను ధనోవా వివరించారు. అలాగే, సైనికపరంగానూ భారత సన్నద్ధత ఎంత ప్రమాదకరమో పసిగట్టారని తెలిపారు. భారత బలగాల సామర్థ్యాన్ని చూసే నాడు పాక్ నాయకుల కాళ్లు వణికి ఉంటాయని పరోక్షంగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ అన్నారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ వైమానిక దాడుల తర్వాత పాక్ చేసిన దుస్సాహసంలో ఏ ఒక్క భారత స్థావరం దెబ్బతిన్నా.. పాక్ స్థావరాల్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యామని నాటి సన్నద్ధతను వివరించారు.
నుదిటిపై ముచ్చెమటలు..
అభినందన్ అప్పగింతకు ముందు ఇస్లామాబాద్‌లో నెలకొన్న ఆందోళనను పీఎంఎల్‌ఎన్ నేత సర్దార్ అయాజ్ సాదిఖ్ తాజాగా పాక్ జాతీయ అసెంబ్లీలో బయపెట్టారు. అభినందన్ విడుదలకు ముందు నిర్వహించిన అత్యున్నత స్థాయి భేటీలో నేతల కాళ్లు వణికిపోయాయన్నారు. నుదిటిపై ముచ్చెమటలు పట్టాయన్నారు. ‘దయచేసి అభినందన్‌ను వదిలేయండి లేదంటే భారత్ దాడికి దిగుతుందం’టూ వాపోయారని నాటి పాక్ దుస్థితిని వివరించారు.
ఇదీ చూడండి:'పుల్వామా దాడి ఇమ్రాన్ ప్రభుత్వ విజయం'