బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సనాతన బ్రాహ్మణ పురోహితులపై వరాల జల్లు కురిపించారు. నెలకు రూ. 1000 భత్యం, 8 వేల మందికిపైగా పేద సనాతన బ్రాహ్మణ పూజారులకు ఉచితంగా ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మమత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
"సనాతన బ్రాహ్మణులు అకాడమీ స్థాపించేందుకు కోలాఘాట్ వద్ద ఇప్పటికే భూమిని ఇచ్చాం. రాష్ట్రంలో చాలా మంది బ్రాహ్మణులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి నెలకు రూ. 1000లతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించాం."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
హిందీ దివాస్-2020లో మాట్లాడిన మమత.. దేశంలోని అన్ని భాషలను గౌరవిస్తున్నామని, భాషా పక్షపాతం తమకు లేదని స్పష్టం చేశారు.
"మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కొత్తగా హిందీ అకాడమీని ప్రారంభించాలని నిర్ణయించాం. అలాగే, దళిత సాహిత్య అకాడమీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దళితుల భాషలు.. బెంగాలీ భాషపై ప్రభావం చూపుతున్నాయి" అని దీదీ అన్నారు.