దేశంలో వ్యవసాయం లాభదాయకంగా మారాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశీయ వ్యవసాయ రంగంలో అనిశ్చితి నెలకొందని... ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని బాగుచేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. గత కొంతకాలంగా వ్యవసాయరంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.
మౌలిక సదుపాయాలు...
ఇక రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛనివ్వాలని.. జాతీయ వ్యవసాయ మార్కెట్(ఈ-నామ్) వ్యవస్థను విస్తరించాలని కోరారు వెంకయ్య. అలాగే మంచి ధర పలికేవరకు రైతులకు తమ పంటలను నిల్వ చేసుకొనేందుకు శీతల గిడ్డంగులు, గోదాములు ఏర్పాటుతో సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోందని ప్రశంసించారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశీయ రైతులకు వరం లాంటిదని.. ఈ పథకం అమలుతో దేశంలోని 72 శాతం మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.
"వ్యవసాయమనేది మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దీన్ని కేవలం ఒక వృత్తిగా మాత్రమే కాక.. పవిత్రమైన కార్యంగా భావిస్తాం. భారతీయ సంసృతిలో వ్యవసాయం ఒక భాగం."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
రైతులకు సాంకేతిక ఫలాలు..
వ్యవసాయం, ఆహార రంగాలపై వాతావరణ మార్పులు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని.. వచ్చే దశాబ్దం నాటికైనా చిన్న, సన్నకారు రైతులపై పెనుభారం పడకుండా సాంకేతికతను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. తుపాన్లు, కరవు పరిస్థితులతో పాటు అధిక వేడి, చీడపీడలను తట్టుకునే పంటల రకాలను అభివృద్ధి పరచాలని సూచించారు. ఈతరం యువకులు వ్యవసాయాన్ని వదిలేసి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కుంటున్నారని.. కూలీల కొరత, విత్తనాలు సరఫరా లోపం, గోదాములు, శీతల గిడ్డంగులు కొరత వంటివి రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యలని.. వీటిని అధిగమించేలా పరిశోధనలు ఉండాలని కాంక్షించారు. ఇక కరోనా వైరస్ విజృంభణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ రైతులు సాగు చేశారని ప్రశంసించారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఖరీఫ్ సీజన్లో 59లక్షల హెక్టార్లు అధికంగా సాగైందన్నారు.
ఇదీ చూడండి : రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు ఫలప్రదంగా జరగాలి: వెంకయ్య