Trump Then And Now : డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాబోతున్నారు. అయితే 2017లో తొలిసారిగా ఆయన ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సమయానికి, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పట్లో ట్రంప్ విధానాలు, అభిప్రాయాల గురించి ఎవరికీ అంతగా తెలియదు. ఆయన పాలనా శైలి ఎలా ఉంటుందో ఎవరూ ఆనాడు అంచనా వేయలేకపోయారు. రంగంలోకి దిగాకే అసలు విషయం తెలిసొచ్చింది. ట్రంప్ డైనమిజం బయటపడింది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఆయన పాలన సాగించిన తీరు ప్రజానీకాన్ని ఆకట్టుకుంది. అందుకే మరోసారి దేశ ప్రజలు ట్రంప్‌నకు పట్టం కట్టారు.
తొలిసారి మంత్రులే వ్యతిరేకించినా!
తొలిసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సమయంలో సాక్షాత్తూ మంత్రిమండలిలోని కొందరి నుంచి ట్రంప్ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. వారు బహిరంగంగానే ట్రంప్ ఐడియాలను విమర్శించారు. అయినా ఆయన చాలా సంయమనంతో వ్యవహరించారు. అందరినీ కలుపుకొని దేశ పాలనా రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇటీవలే విలేకరులతో మాట్లాడుతూ, తన మొదటి పాలనా కాలాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. "ఈ సారి మనం అమెరికా కోసం మరింత బాగా పనిచేయనున్నాం. ఎందుకంటే మనకు సరిపడా అనుభవం ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. "నాకు ఇప్పుడు గొప్పవాళ్లు ఎవరో తెలుసు. స్మార్ట్ ఎవరో తెలుసు. మూగవాళ్లు ఎవరో తెలుసు. బలహీనులు ఎవరో తెలుసు. మూర్ఖులు ఎవరో తెలుసు" అని తెలిపారు. "ట్రంప్ ఒంటి చేత్తో మా పార్టీని మార్చారు. నాలుగేళ్ల పోరాటం తర్వాత, గెలుపు దిశగా తీసుకొచ్చారు. ఆయన గ్రేట్" అని అధికార రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ అమలు చేసిన వ్యూహాలే తమ పార్టీకి కలిసొచ్చాయన్నారు.
ఈ సారి బలం, బలగంతో బరిలోకి!
గతంలో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ట్రంప్ ప్రధానంగా ఎన్నికల ప్రచార మేనేజర్లపై ఆధారపడ్డారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన శైలిని మార్చారు. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత సూసీ వైల్స్ అనుభవాన్ని తన ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకున్నారు. సూసీ వైల్స్ అందించిన సలహాలు గ్రౌండ్ లెవల్‌లో బాగా పనిచేశాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని బలహీనంగా చూపడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు.
తొలుత బైడెన్‌ను, తర్వాత కమలా హ్యారిస్‌ను ట్రంప్ విమర్శించిన తీరుతో రిపబ్లికన్ పార్టీలో జోష్ వచ్చింది. పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోయేందుకు మార్గాన్ని తయారు చేసింది. ఫలితంగా అమెరికా ప్రజానీకం ఆయన వైపునకు మళ్లారు. ఇప్పుడు ట్రంప్‌కు బలంతో పాటు బలగం కూడా ఉంది. ఆయన మంత్రిమండలిలో ఎంతోమంది సన్నిహితులకు, మేధావులకు అవకాశాన్ని కల్పించారు. వీరిలో పలువురు భారత సంతతి నేతలు కూడా ఉన్నారు. ట్రంప్‌నకు విధానపరంగా సలహాలు అందించేందుకు హెరిటేజ్ ఫౌండేషన్, అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వంటివి ఉన్నాయి. వాటి సూచనల మేరకు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయగానే ట్రంప్ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయనున్నారు. ప్రభుత్వ విధానపరమైన ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంది.
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా- మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా చూస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడి అధికారాలు, విధులేంటి? ట్రంప్ 'సూపర్ పవర్స్' తెలిస్తే షాకే!