వచ్చే ఏడాది తొలినాళ్లల్లో.. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి భారత్కు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అందుక తగ్గట్టుగానే పంపిణీపై ప్రణాళికలు రచిస్తున్నట్టు స్పష్టం చేశారు.
కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రుల బృందం(జీఓఎమ్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు హర్షవర్ధన్.
"దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మొదటి భాగంలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచే టీకా వస్తుందని ఆశిస్తున్నాం. దీని కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వ్యాక్సిన్ పంపిణీ కోసం పక్కా ప్రణాళికలు అమలు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాం."
-- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యమంత్రి.
వచ్చే జులై నాటికి దేశంలోని 20-25 కోట్ల మంది ప్రజలకు 40-45 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్యమంత్రి.
పరిశోధనలకు సహకారం...
కరోనా వ్యాక్సిన్ టీకా అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ కోసం సంస్థలకు ఆర్థిక సహకారం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన అనంతరం 400-500 మిలియన్ డోసులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన 'జాన్సన్ అండ్ జాన్సన్'