దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఈ ఏడాదికి గానూ.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇవ్వాలని ఉత్తరాఖండ్ మాజీ సీఎం, సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ డిమాండ్ చేశారు. ఆమెతో పాటు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికీ ప్రదానం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు రావత్.
"సోనియా గాంధీ, మాయావతులిద్దరూ రాజకీయంలో ఉద్దండులు. ఈ విషయంలో ఏకీవభించినా, విభేదించినా పర్వాలేదు. కానీ, సోనియాజీ మాత్రం ఓ భారతీయ మహిళ అనే విషయాన్ని అంగీకరించాల్సిందే. అంకిత భావం, అద్భుతమైన ప్రజాదరణతో దేశం గర్వించేస్థాయికి ఎదిగారామె. కాబట్టి.. ప్రభుత్వం వీరికి భారతరత్న ఇచ్చి గౌరవించాలి."
- హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి
కాంగ్రెస్, మాయావతితో పాటు రాహుల్ గాంధీలను ట్యాగ్ చేశారు రావత్. అయితే.. ఆయన డిమాండ్ పట్ల పలువురు ఆశ్చర్యపోయారు. భారతరత్న పురస్కారాన్ని సోనియాకు ఇవ్వాలన్న ప్రతిపాదన బాగానే ఉన్నా.. ఇందులో మాయావతి పేరును చేర్చడం గమనార్హం.
ఇదీ చదవండి: 'ఆ అనుమతులు వచ్చాకే సెంట్రల్ విస్టా నిర్మాణం'