విరివిగా మొక్కలు నాటి అడవుల విస్తీర్ణం పెంచటానికి మాత్రమే కంపా నిధులను వినియోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ రాష్ట్రాలకు సూచించారు. సిబ్బంది జీతాల చెల్లింపులు, ప్రయాణ భత్యాలు, వైద్య అవసరాలకు ఆ నిధులను ఖర్చు చేయటం తగదని పేర్కొన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్రాల అటవీశాఖ మంత్రులతో ఆయన మాట్లాడారు.
పరిహారక అటవీకరణ నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ (సీఏఎంపీఏ-కంపా) ద్వారా రాష్ట్రాలకు కేటాయిస్తున్న నిధుల్లో 80 శాతాన్ని అడవుల పెంపకం, మొక్కలు నాటడానికి, మిగిలిన 20 శాతం నిదుల్ని వాటి సంరక్షణకు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పారు.
కర్బన ఉద్గారాల నియంత్రణకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా దేశంలో నగర వన పథకం ద్వారా అర్బన్ ఫారెస్ట్రీని ప్రోత్సహించటం, 13 ప్రధాన నదుల పరివాహక ప్రాంతాలను ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దటం, భూసార పరిరక్షణ తదితర కార్యక్రమాలను కేంద్రం చేపడుతోందని వివరించారు. త్వరలో 'స్కూల్ నర్సరీ స్కీమ్'ను ప్రారంభించి మొక్కల పెంపకంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాల సాధనలో రాష్ట్రాలూ మమేకం కావాలని కోరారు.
ఇదీ చూడండి: దేశంలో 27 లక్షలు దాటిన కరోనా కేసులు