ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా కశ్మీర్ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఐరాసలో ఏం ప్రసంగిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చివరిసారిగా నాలుగేళ్ల క్రితం ఐరాసలో ప్రసంగించారు మోదీ. ఆ తర్వాత ఏటా అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత్ తరఫున ఐరాస వార్షిక సమావేశాల్లో ప్రసంగించారు.
గత ఐదేళ్లలో ఈ సమావేశాల్లో భారత్, పాక్ ప్రస్తావించిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
2014: 69వ వార్షిక సమావేశాల్లో...
శాంతియుత వాతావరణం నెలకొల్పితేనే పాకిస్థాన్‌తో చర్చలు ఉంటాయని ఐరాస 69వ సాధారణ సమావేశాల్లో స్పష్టంచేశారు మోదీ. పాక్ మాత్రం పాత పాడే పాడింది.
"కొన్ని తరాలుగా కశ్మీరీ ప్రజలు హింస, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనల మధ్య జీవితం గుడపుతున్నారు. జమ్ముకశ్మీర్ ప్రధాన సమస్యను పరిష్కరించాలి. అంతర్జాతీయ సమాజమే ఇందుకు బాధ్యత వహించాలి. కశ్మీర్ సమస్యపై ముసుగు కప్పలేము. "
-అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.
"పాక్‌తో స్నేహాన్ని, సహకారాన్ని ప్రోత్సహించేందుకు చిత్తశుద్ధితో, శాంతియుత వాతావరణంలో, తీవ్రవాద ఛాయలు లేకుండా ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు నేను సిద్ధం. అలాంటి వాతావరణం నెలకొల్పేందుకు పాకిస్థాన్ బాధ్యత తీసుకోవాలి."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని.
2015: 70వ వార్షిక సమావేశాల్లో...
శాంతి సాధనకు నాలుగు సూత్రాలు ప్రతిపాదిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలపగా.. తీవ్రవాదాన్ని విడనాడితే చాలని సుష్మా స్వరాజ్ బదులిచ్చారు.
"మూడు తరాల కశ్మీరీ ప్రజలు నేరవేర్చని వాగ్ధానాలను, దారుణమైన అణచివేతను మాత్రమే చూశారు. స్వీయ నిర్ణయాధికారం కోసం లక్ష మందికిపైగా మరణించారు. ఇది ఐరాస అతిపెద్ద వైఫల్యం. శాంతి సాధనకు నాలుగు సూత్రాలను నేను ప్రతిపాదిస్తున్నా. "
-అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.
" భారత్‌లో అస్థిరత్వం నెలకొల్పేందుకే ఉగ్రదాడులు జరుపుతున్నారని అందరికీ తెలుసు. జమ్ముకశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలను అక్రమంగా స్వాధీనం చేసుకుని మిగిలిన ప్రాంతాలను కూడా చేర్చుకోవాలని చూస్తున్నారు. మాకు నాలుగు సూత్రాలు అవసరం లేదు. ఒక్కటి చాలు. ఉగ్రవాదాన్ని వదిలేయండి. మనం కూర్చొని మాట్లాడుకుందాం. "
-సుష్మా స్వరాజ్, అప్పటి భారత విదేశాంగ మంత్రి
2016: 71వ వార్షిక సమావేశాల్లో...
కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. బలూచిస్థాన్‌లో దారుణమైన అణచివేత జరుగుతోందని సుష్మ ఎదురుదాడి చేశారు.
"భారత బలగాల చేతిలో హత్యకు గురైన బుర్హాన్ వాని కశ్మీర్ ఇంతిఫదాకు చిహ్నంగా అవతరించాడు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతన్నాయని రుజువు చేసే ఆధారాలను నేను ఐరాస ప్రధాన కార్యదర్శికి రహస్య పత్రాల్లో అందజేస్తాను."
-అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.
"ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు ఇంకా ఉన్నాయి. తీవ్రవాదులను పెంచి పోషించడం వారికి అలవాటుగా మారింది. బలూచిస్థాన్‌లో ఏం చేస్తున్నారనే విషయంపై పాకిస్థాన్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అక్కడ ఘోరమైన అణచివేత జరుగుతోంది."
-సుష్మా స్వరాజ్, అప్పటి విదేశాంగ మంత్రి
2017: 72వ వార్షిక సమావేశాల్లో...
కశ్మీర్‌కోసం ప్రత్యేక రాయబారిని ఏర్పాటు చేయాలని ఐరాసను కోరింది పాక్.
" కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించి విచారణ జరిపేందుకు కమిషన్‌ను పంపాలని ఐరాస ప్రధాన కార్యదర్శిని కోరుతున్నా. కశ్మీర్ కోసం ప్రత్యేక రాయబారిని నియమించాలి. "
-షాహిద్ ఖాకన్ అబ్బాసి, అప్పటి పాక్ ప్రధాని.
" భారత్, పాక్‌కు కొద్ది గంటల వ్యవధిలోనే స్వాతంత్ర్యం వచ్చింది. మేము పండితులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులను తయారు చేశాం. మీరేం చేశారు? ఉగ్రవాదులను తయారు చేశారు."
-సుష్మా స్వరాజ్, అప్పటి విదేశాంగ మంత్రి
2018: 73వ వార్షిక సమావేశాల్లో..
పాకిస్థాన్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు భారత్ మద్దతిస్తోందని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తీవ్ర ఆరోపణలు చేశారు. సుష్మ తిప్పికొట్టారు.
"పెషావర్‌లో జరిగిన సామూహిక హత్యల్లో అమాయక చిన్నారులు మరణించిన ఘటనను పాక్ ఎప్పటికీ మరచిపోదు. మస్తుంగ్ దాడితో పాటు ఇతర దాడులకు భారత్ మద్దతు తెలిపింది. ఎంతోమంది పాకిస్థానీలు మృతి చెందిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడి ఘటననూ మార్చిపోము. "
-షా మహమూద్ ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి.
"మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్ పదే పదే భారత్‌పై ఆరోపణలు చేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలను అతిక్రమించేవారు ఉగ్రవాదులు. పాకిస్థాన్ వాళ్లను కీర్తిస్తుంది. అమాయక ప్రజల నెత్తురుపై మౌనం వహిస్తోంది."
--సుష్మా స్వరాజ్, అప్పటి విదేశాంగ మంత్రి
ఇదీ చూడండి:విద్యుత్ కాంతుల్లో సరికొత్తగా పార్లమెంట్