మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు భాజపాపై పరోక్ష విమర్శలు గుప్పించింది శివసేన. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. సేన చేతిలోనే అధికార రిమోట్ ఉంటుందని తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది.
"2014లో వచ్చిన 63 సీట్లతో పోల్చితే.. ఈసారి సేనకు తక్కువ సీట్లు వచ్చాయి. కానీ అధికార రిమోట్ కంట్రోల్ సేన చేతిలోనే ఉంది. పులి (శివసేన గుర్తు).. కమలం (భాజపా గుర్తు)ని చేతపట్టుకున్న కార్టూన్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది."
-శివసేన
భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు తన డిమాండ్ల సాధనకు శివసేన దృఢ వైఖరి అవలంబిస్తుందని సంకేతాలిచ్చింది సామ్నా.
భాజపాపై విమర్శలు..
సామ్నా వేదికగా భాజపాపై తీవ్ర విమర్శలు చేసింది సేన. 164 స్థానాల్లో పోటీ చేసి 144 సీట్లు గెలవాలనుకున్న భాజపా వ్యూహాన్ని ప్రజలు తిరస్కరించారని పేర్కొంది. కాంగ్రెస్-ఎన్సీపీ కీలక నాయకులను ఆకర్షించి లేదా భయపెట్టి భాజపాలోకి చేర్చుకోవటం ద్వారా సంఖ్యను పెంచుకోవాలనే ఆలోచనలను ప్రజలు ఓడించారని తెలిపింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న భాజపా ప్రయత్నాలను సేన 2014, 2019లోనూ అడ్డుకుందని పేర్కొంది సామ్నా.
తొలి ప్రభుత్వంలోనే..
1995-99 మధ్య కాలంలో తొలిసారి శివసేన-భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పాలన కాలంలోనే రిమోట్ కంట్రోల్ అనే పదం ఎక్కువగా వినియోగంలో ఉంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కనుసన్నల్లోనే నిర్ణయాలు జరిగేవి.
తగ్గిన భాజపా బలం..
ఇటీవల వెలువడిన శాసనసభ ఫలితాల్లో భాజపా బలం గతంలో కంటే కాస్త తగ్గింది. 2014లో 122 సీట్లు సాధించగా 2019లో 105 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో శివసేన-భాజపా మధ్య పాలనాపరమైన చిక్కులు తలెత్తాయి. 50:50 ప్రతిపాదన చేసింది సేన. అధికారాన్ని సమానంగా పంచుకోవటంపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: ఖట్టర్ 2.0: హరియాణాలో కొలువుదీరిన ప్రభుత్వం