పచ్చని చెట్ల నడుమ జీపులో ప్రయాణం.. స్వచ్ఛమైన గాలి.. అక్కడక్కడా చిన్న చిన్న నీటి కుంటలు.. అప్పుడు తారసపడే వన్య ప్రాణులు.. ఇలా అందంగా సాగిపోతుంది అటవీ ప్రాంతాల్లో పర్యటకుల సఫారీ. అయితే.. ప్రతిసారీ ఇలాగే ఉంటుందా అంటే పొరపాటే. ఒక్కోసారి అవాక్కయ్యే ప్రమాదాలూ ఎదురవ్వొచ్చు. అవును, ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో సఫారీ చేద్దామని అడవిలోకి వెళ్లిన.. వాహనానికి ఎదురెళ్లి మరీ పర్యటకులను తరిమికొట్టింది ఓ ఏనుగు.
రాజాజీ టైగర్ రిజర్వ్ పార్క్‌లోని చీలా రేంజ్లో.. కొందరు పర్యటకులు జీపులో ప్రయాణిస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రయాణంలో ఓ ఏనుగు ఎదురైంది. భారీ గజరాజును అంత దగ్గర నుంచి చూడగలిగినందుకు మొదట ఆనందంగా వీడియో తీయడం ప్రారంభించారు జీపులోని ఔత్సాహికులు.
డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు...
అది గమనించిన ఏనుగు 'నా అడ్డాలోకి రావడానికి మీరెవరు' అని అనుకుందో ఏమో వారి వాహనానికి ఎదురు నడిచింది. గజం తమవైపే వస్తుండడాన్ని గమనించిన యాత్రికుల గుండెల్లో వణుకు పుట్టింది.
అయితే.. జీపు డ్రైవర్ చాకచక్యంగా రివర్స్ గేర్‌లో బండిని వెనక్కి తీసుకెళ్లడం వల్ల పర్యటకులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తరువాత, గాల్లో తుపాకీ పేల్చగానే ఏనుగు అడవిలోకి పారిపోయింది. గజరాజు దెబ్బకి ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు పార్కులో సఫారీ జీపు డ్రైవర్లకూ తుపాకీ కాల్చడం నేర్పించాలని నిర్ణయించారు నిర్వాహకులు.