దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ రుసుముల వసూలును ప్రారంభించింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ). కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆదేశాలకు అనుగుణంగా టోల్ ఫీజును వసూలు చేస్తోంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర సేవలపై భారాన్ని తగ్గించడం కోసం టోల్ వసూలును నిలిపేయాలని మార్చి 25న కేంద్రం ప్రకటించింది. అంతర్రాష్ట్ర, రాష్ట్రాల పరిధిలో ట్రక్కులు, ఇతర సరకు రవాణా వాహనాలు తిరగడానికి వీలుగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన సడలింపులను అమలుచేసింది. అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు జాతీయ రహదారులపై పన్ను వసూళ్లు ప్రారంభమయ్యాయి.
నేటి అర్థరాత్రి నుంచి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీ చేస్తున్నట్లు వసూలు సంస్థల్లో ఒకటైన ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
"టోల్ కార్యకలాపాలు ప్రారంభించాలని సంబంధిత శాఖల నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వసూళ్లు మొదలు పెట్టాం. ఇది రవాణా రంగానికి సానుకూల సంకేతం. దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేతకు సూచనలా కన్పిస్తోంది."
-ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రతినిధి
రవాణా సంఘాల వ్యతిరేకత
అయితే ప్రభుత్వ నిర్ణయంపై అఖిల భారత మోటారు ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. మే 3 వరకైనా పన్ను వసూళ్లు నిలిపేయాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయంతో రబీ పంటను మార్కెట్లకు తరలించడంలో సమస్యలు వస్తాయని వివరించింది. 85 శాతంగా ఉన్న చిన్న రవాణాదారులు టోల్ ఫీజు భారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో తట్టుకోలేరని తెలిపింది. నిత్యావసర వస్తువుల రవాణా కొనసాగాలన్న ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అనేక ఇబ్బందులు ఎదురైనా ట్రక్కుల యజమానులు పనిచేస్తున్నారని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఈ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికం: హోంశాఖ