తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2174 కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న చెన్నై, దాని చుట్టుపక్కల జిల్లాలు తిరవళ్లూర్, చెంగల్పేట్, కాంచీపురంలో శుక్రవారం నుంచి 12 రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 70 శాతానికిపైగా కేసులు నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
277 మంది రోగులు మిస్సింగ్..
రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానున్న తరుణంలో చెన్నైలో 277 మంది కరోనా రోగులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. వీరిని ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా ఎలాంటి పురోగతి లేదు. వీరిలో కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారు కాగా.. మరికొందరు తప్పుడు వివరాలు ఇచ్చిన కారణంగా గుర్తించడం కష్టమవుతోంది
తమిళనాడులో ఇప్పటివరకు 50 వేల 193 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 576 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై ప్రాంతంలోనే 35 వేల మందికిపైగా బాధితులున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి 10 లక్షల మందికి 9 వేల 845 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంద శాతానికి 6.4 శాతం మందికి పాజిటివ్‌గా తేలుతోంది.
లాక్డౌన్ వివరాలు...
చెన్నై, తిరవళ్లూర్, చెంగల్పేట్, కాంచీపురం జిల్లాల్లో 12 రోజులు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఆ ప్రాంతాల్లో నిత్యవసర సేవలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఉంటుంది. జూన్ 21, 28 రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారు.
- దుకాణాలు మూసివేయాలి.
- కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల విక్రయాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే అనుమతి.
- అత్యవసరం అయితేనే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.
- హోటళ్లు, రెస్టారెంట్లకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి. పార్సిల్ సుదుపాయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతి.
- చెన్నై దాటి వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి. వివాహ వేడుకలు, అంత్యక్రియలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించి సరైన పత్రాలు ఉంటేనే అనుమతి.
- రైలు, విమాన సేవలు యాథావిధిగా కొనసాగుతాయి.
- జూన్ 21, 28 ఈ రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. నిత్యావసర, అత్యవసర సేవలకే అనుమతి.
- కంటైన్మెంట్ జోన్లలో లేని 33 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలి.
- కంటైన్మెంట్ జోన్లకు ఎలాంటి సడలింపులు లేవు.
- లాక్డౌన్లో టీ షాపులు తెరిచేందుకు అనుమతి లేదు.
- అమ్మ క్యాంటీన్లు తెరిచే ఉంటాయి.
- నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. పని ప్రదేశంలోనే కార్మికులకు ఆశ్రయం కల్పించాలి. వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి.
- బ్యాంకులు, కోర్టులు, మీడియా సంస్థలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు.