పశ్చిమ్ బంగాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ రెబల్ నేత, మాజీ మంత్రి సువేందు అధికారి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది.
సువేందు రాజీనామా పత్రంలో తేదీ స్పష్టంగా పేర్కొనలేదని తెలిపారు బంగాల్ అసెంబ్లీ స్పీకర్ బీమన్ బెనర్జీ. రాజీనామాను సువేందు స్వయంగా సమర్పించలేదని.. ఈ కారణంగా అది నిజమైనదని, స్వచ్ఛందంగా చేశారని నిర్ధరించడం కష్టమని పేర్కొన్నారు. అందుకే రాజీనామా ఆమోదించడం కుదరదని స్పష్టం చేశారు. దీనిపై ఈ నెల 21లోపు సువేందును వ్యక్తిగతంగా కలవాలని సూచించారు స్పీకర్.
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పని చేశారు సువేందు. గత నెల మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ నెల 16న ఎమ్మెల్యే పదవికీ రాజీమానా చేశారు. ఆయన రాజీనామాను అసెంబ్లీ సచివాలయంలో సమర్పించారు.
టీఎంసీ మైనారిటీ విభాగ ప్రధాన కార్యదర్శి రాజీనామా..
టీఎంసీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. టీఎంసీ నేత మైనారిటీ విభాగ ప్రధాన కార్యదర్శి.. కబీరుల్ ఇస్లాం ఆయన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. బంగాల్ టీఎంసీ మైనారిటీ విభాగ అధ్యక్షుడికి లేఖ సమర్పించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని అందులో పేర్కొన్నారు.
సువేందుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ
టీఎంసీని వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సువేందుకు బంగాల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో 'జెడ్ ప్లస్' రక్షణ కల్పించాలని నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు సువేందుకు 'వై ప్లస్' సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ.
ఇవీ చూడండి: