భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ప్రముఖ మ్యాగజిన్ టైమ్ తమ 2019 అంతర్జాతీయ ఎడిషన్ కవర్ పేజీపై ప్రచురించింది. ఈ ముఖచిత్రంపై 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' అంటూ వివాదాస్పద శీర్షికను పెట్టింది. అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి మే 20న ఈ సంచిక రానుంది.
అమెరికా ఎడిషన్ ముఖచిత్రంపై 2020 అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రాట్ నేత ఎలిజబెత్ వారెన్ చిత్రాన్ని ముద్రించింది. దక్షిణ పసిఫిక్ మ్యాగజిన్ కవర్ పేజీపై భారత ప్రధాని మోదీ చిత్రాన్ని ప్రచురించింది టైమ్.
'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' కథనాన్ని భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ కుమారుడు ఆతిశ్ తసీర్ రాశారు.
"2014లో భారత్లో ఉన్న విభేదాలు, వైరుధ్యాలను ప్రస్తావించి మార్పు కోరుకునే వాతావరణాన్ని సృష్టించిన మోదీ... 2019 ఎన్నికలకు అదే వైరుధ్యాలను, విభేదాలను వదిలేసి ప్రజలు బతకాలి అంటూ బరిలో నిలిచారు.
మోదీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రమాదకర మతపరమైన జాతీయవాద వాతావరణం ఏర్పడేందుకు సహకరించారు. మోదీ తాను తీసుకొస్తానన్న అభివృద్ధిని మరచి భారతీయుల్లో వైరుధ్యాలు వచ్చేందుకు ప్రయత్నించారు."
- టైమ్ కథనం సారాంశం
ప్రతిపక్ష కాంగ్రెస్ గురించీ ఇందులో ప్రస్తావించారు. వారసత్వ సూత్రం కాకుండా కాంగ్రెస్ ఇంకా ఏమైనా పాటించాలని అభిప్రాయపడ్డారు.
"భారతదేశ పురాతన పార్టీ కాంగ్రెస్కు రాజకీయంగా సరైన వ్యూహం లేదు. రాహుల్ గాంధీ సోదరి అయిన ప్రియాంక గాంధీని ఆయనకు తోడుగా ఉంచేలా చేయడం తప్ప. మోదీ అదృష్టవంతులు ఎందుకంటే ఆయన ఎదురుగా బలహీన ప్రతిపక్షం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహకూటమికి మోదీని పదవి నుంచి దించేయడం తప్ప మరో లక్ష్యం లేదు. 2014లో ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని మోదీకి తెలుసు. అందుకే ఆయన సొంత కూటమిలోనే ప్రత్యర్థులు తయారయ్యారు."
- టైమ్ కథనం సారాంశం
'మోదీ ద రిఫార్మర్' పేరుతో మరో కథనం ఉంది. ఈ కథనాన్ని యూరేసియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమ్మర్ రాశారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మోదీకి మరో ఐదేళ్లు అవకాశం ఇస్తుందా? అనే అంశాన్ని ప్రస్తావించారు. 'మోదీ ఈజ్ ద ఇండియాస్ బెస్ట్ హోప్ ఫర్ ఎకనామిక్ రిఫార్మ్' అంటూ పలు రీతిలో కథనాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: 'మోదీ.. నేను గుజరాతీనే.. నాతో చర్చకు వస్తారా'