అడవిలో బతకమని ఎన్నిసార్లు తీసుకెళ్లి వదిలినా... జనావాసాల్లోకి రావడం మానలేదు ఓ పులి. దీంతో విసుగెత్తిపోయిన అటవీ అధికారులు ఆ వన్యమృగాన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్ 'వన్ విహార్ జాతీయ పార్కు'లో క్వారంటైన్లో ఉంచారు.
ఇద్దరు బలి
'సరన్'గా పిలిచే ఈ పులి మహారాష్ట్ర సరిహద్దుల్లోని జనావాసాల్లో తిరుగుతూ ఉండగా 2018లో గుర్తించారు. అప్పటికే ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టించిన ఈ పులి ఇద్దరు వ్యక్తులను బలి తీసుకుంది. అతి కష్టం మీద ఈ పులిని అటవీ అధికారులు 2018 డిసెంబరు 11న మధ్యప్రదేశ్లో పట్టుకుని సాత్పురా పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
కానీ అక్కడ నుంచి తప్పించుకున్న సరన్.. మరోసారి జనవాసాల్లోకి వచ్చింది. అధికారులు 2019 ఫిబ్రవరి 10న పట్టుకుని కన్హా పులుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయినప్పటికీ తప్పించుకుని జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
చివరకు విసుగెత్తిపోయిన అధికారులు.. ఈ సారి భోపాల్ వన్ విహార్ జాతీయ పార్కులో క్వారంటైన్లో ఉంచారు. దీంతో ఆ పార్కులో 14కు చేరింది పులుల సంఖ్య.
ఇదీ చూడండి : అన్లాక్ 1.0: సోమవారం ఆతిథ్యం, పర్యటకం షురూ