నీటి సంరక్షణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, సంప్రదాయ జలాశయాల పునరుద్ధరణకు ఉద్దేశించిన జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. జలశక్తి అభియాన్ పేరుతో జులై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు తొలిదశ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ప్రకటించారు. రెండో దశ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు జరుగుతుందని వెల్లడించారు.
దేశ వ్యాప్త కార్యక్రమమైనప్పటికీ నీటి కొరతతో ఉన్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో కార్యక్రమాల నిర్వహణ అధికంగా ఉండనుంది. నీటి కొరత ఉన్న జిల్లాల్లో ఈ కార్యక్రమ అమలుకు ఒక అదనపు కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శిని నియమించనుంది. కేంద్ర నీటి బోర్డు, కేంద్ర జల కమిషన్ నుంచి 447 సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
ప్రతి జిల్లాకు ఒక నీటి సంరక్షణ ప్రణాళిక రూపొందించి... రైతులను భాగస్వామ్యం చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు. కృషి విజ్ఞాన కేంద్రాలను పరిగణనలోకి తీసుకుని.. అధిక విస్తీర్ణంలో సాగు సహా... అధిక దిగుబడికి కృషి చేయాలని కేంద్రం కోరింది.
"జలశక్తి అభియాన్ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమంగా మారనంత వరకు జలశక్తి అభియాన్ విజయవంతం కాలేదు. ప్రతి వ్యక్తి దీనిపై ఆలోచించాలి. ప్రతి వ్యక్తి జల సంరక్షణపై ఆలోచించినప్పుడే నీటి వినియోగాన్ని పొదుపుగా చేస్తాడు. రాష్ట్రాల ప్రభుత్వాలకు మేం సూచించాం. నిర్లక్ష్యానికి గురైన సంప్రదాయ నీటి వనరులను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాలన్న భేదం లేకుండా ఎక్కడ ఉన్నా ఎలా పునర్వియోగంలోకి తీసుకురావాలో ప్రణాళికలు తయారు చేయాలి."
-గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలవనరుల మంత్రి
ఇదీ చూడండి: 'అలా జరిగితే రెండంచెల జీఎస్టీ సాధ్యమే!'