గాంధీ అంటే భారత్కు పర్యాయపదమని మహాత్ముని 150వ జయంతి సందర్భంగా కొనియాడారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కొంతమంది తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని భాజపా, ఆర్ఎస్ఎస్లను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. వారు గాంధీ త్యాగాలను, సిద్ధాంతాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు.
గాంధీ జయంతి సందర్భంగా దిల్లీలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు సోనియా. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
"భారత్ ప్రస్తుతం సాధిస్తున్న పురోగతి గాంధీ మార్గంలో నడవడం వల్లే సాధ్యమైంది. గాంధీని స్మరించడం సులభమే కానీ ఆయన మార్గాన్ని అనుసరించడం అంత సులువేమీ కాదు. గాంధీని స్మరిస్తూనే ఆయన మార్గం నుంచి భారతీయులను తప్పించి, వారికి అనుకూలమైన మార్గం వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇంతకుముందు జరిగాయి. కానీ కొన్నేళ్లుగా సామ, దాన, దండ, భేద సూత్రాలు నిరాటంకంగా ఉపయోగించి అత్యంత బలవంతులం అని కొందరు అనుకుంటున్నారు. గాంధీ కాదు... ఆర్ఎస్ఎస్నే భారత్కు ప్రతీకగా మార్చాలని ఆశిస్తున్నారు. సమ్మిళిత సమాజం, సభ్యతతో కూడిన భారత్ కేవలం సమానత్వం అనే సిద్ధాంతంపై తప్ప వేరొక ఆలోచనపై నడవదు. గాంధీ విద్వేషానికి కాదు, ప్రేమకు ప్రతీక. ఒత్తిళ్లకు కాదు మంచితనానికి ప్రతీక. ఆయన నిరంకుశత్వానికి కాదు, ప్రజాస్వామ్యానికి ప్రతీక. గాంధీ సిద్ధాంతాలపైనే కాంగ్రెస్ నడిచింది. నడుస్తుంది."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఇదీ చూడండి: బాపూ జయంతి: రాహుల్ 'గాంధీ సందేశ్ యాత్ర'