అసోం... ఈశాన్య భారతంలోని సరిహద్దు రాష్ట్రం. అక్కడి పరిస్థితులు ఎంతో ప్రత్యేకం. పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వలస రావడం... ఆ రాష్ట్ర స్థితిగతుల్ని సంక్లిష్టం చేసింది. అసలైన పౌరులెవరో, అక్రమ వలసదారులెవరో నిగ్గు తేల్చడం అనివార్యమైంది. ఇందుకు జాతీయ పౌర రిజిస్టర్-ఎన్ఆర్సీ మార్గమైంది.
ఇదే తొలిసారి కాదు...
ఎన్ఆర్సీ... అసోంకు కొత్త కాదు. 1951లోనే తొలి జాతీయ పౌర రిజిస్టర్ను ప్రచురించారు. తర్వాత ఆ జాబితా అప్డేట్ కాలేదు. ఎన్ఆర్సీ కొత్త జాబితా రూపొందించాలని 2005లోనే నిర్ణయించినా... ఆ ప్రక్రియ ప్రారంభించేందుకు 9 ఏళ్లు పట్టింది.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా... ఎన్ఆర్సీ రూపొందించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షించింది.
గతేడాది తుది ముసాయిదా...
2018 జులై 30న అసోం ఎన్ఆర్సీ తుది ముసాయిదా విడుదల చేశారు అధికారులు. మొత్తం 3 కోట్ల 29 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... అందులో 2 కోట్ల 89 మంది జాబితాలో చోటు సంపాదించారు. 40 లక్షల మందికిపైగా భారతీయ పౌరులు కారని తేల్చారు అధికారులు.
జాబితాలో చోటు దక్కని వారికి మరో అవకాశం కల్పించారు. ఇందుకు 2018 డిసెంబర్ 31వరకు గడువిచ్చారు. 29.5 లక్షల మంది అప్పీలు చేసుకున్నారు.
తర్వాత జరిగిన ఎన్నో వివాదాలు, న్యాయపోరాటాల నేపథ్యంలో... అనేక నెలలకు తుది ఎన్ఆర్సీ సిద్ధమైంది.
71 ఏళ్ల ఎన్ఆర్సీ ప్రస్థానం...
భారత దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ఆర్సీకి సంబంధించిన కీలక పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం....
- 1948 జులై 19:
1948 జులై 19న "పశ్చిమ పాకిస్థాన్ నుంచి వలసలనియంత్రణ ఆర్డినెన్స్" అమల్లోకి వచ్చింది. అంతకుముందు వరకు భారత్-పాకిస్థాన్ మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలపై ఎలాంటి ఆంక్షలు లేవు. 1948 జులై 19కి ముందు పాక్ నుంచి వచ్చిన వలస వచ్చినవారికే పౌరసత్వం కల్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
- 1950 మార్చి 1:
వలసదారుల బహిష్కరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఫలితంగా అసోం నుంచి కొందరు వలసదారులను బలవంతంగా బయటకు పంపే అధికారం కేంద్రానికి వచ్చింది.
- 1950 ఏప్రిల్ 8:
దాయాది దేశాల్లో మైనార్టీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా 1950 ఏప్రిల్ 8న నెహ్రూ-లియాఖత్ ఒప్పందం కుదిరింది. 1950 డిసెంబర్ 31కి ముందు స్వదేశానికి తిరిగి వచ్చిన శరణార్థులకు వారివారి ఆస్తులు తిరిగి దక్కుతాయని ఆ ఒడంబడికలో పేర్కొన్నారు. తూర్పు బంగాల్, పశ్చిమ బంగాల్, అసోం, త్రిపుర వలసదారులకు ఇది వర్తిస్తుందని స్పష్టంచేశారు.
- 1951:
స్వతంత్ర భారతంలో తొలిసారి జనాభా గణన చేపట్టారు. ఆ జనాభా లెక్కల ఆధారంగా అసోంలో తొలి ఎన్ఆర్సీ రూపొందించారు.
- 1955 డిసెంబర్ 30:
పుట్టుక, వారసత్వం, రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ పౌరసత్వం కల్పించేందుకు సంబంధించిన నిబంధనలతో "పౌరసత్వ చట్టం" అమల్లోకి వచ్చింది.
- 1957:
అసోం నుంచి వలసదారులను బహిష్కరించే చట్టం రద్దు.
- 1960 అక్టోబర్ 24:
అసామీని మాత్రమే రాష్ట్ర అధికారిక భాషగా చేస్తూ బిల్లు ఆమోదించిన అసోం శాసనసభ.
- 1961 మే 19:
అసామీని అధికారిక భాషగా చేయడాన్ని నిరసిస్తూ బరాక్ లోయలో బంగాలీ భాషోద్యమం ప్రారంభం.
- 1961-1996:
పాకిస్థానీయులు భారత్లోకి చొరబడడాన్ని నియంత్రించే ప్రాజెక్టులో భాగంగా అసోం నుంచి వేలాది మంది తూర్పు పాకిస్థానీ వలసదారులను బయటకు పంపేశారు.
- 1964:
తూర్పు పాకిస్థాన్(ప్రస్తుతం బంగ్లాదేశ్)లో అల్లర్లు... బంగాలీ హిందువులు భారీ స్థాయిలో భారత్కు వలస వచ్చేందుకు కారణం అయ్యాయి.
- 1964 సెప్టెంబర్ 23:
'విదేశీయుల చట్టం-1946' ప్రకారం 'విదేశీయుల వివాద పరిష్కార మండలి' ఏర్పాటుకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. విదేశీయులను గుర్తించేందుకు సివిల్ కోర్టులతో సమానంగా అధికారాలుండే ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలన్నది ఈ ఉత్తర్వుల సారాంశం.
- 1965 ఏప్రిల్-సెప్టెంబర్:
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం. తూర్పు పాకిస్థాన్ నుంచి భారత్లోకి మరింత పెరిగిన శరణార్థుల రాక.
- 1967 ఆగస్టు 8:
అఖిల అసోం విద్యార్థి సంఘం ఏర్పాటు.
- 1967:
అసోం అధికారిక భాషా చట్టం సవరణ. బరాక్ లోయలోని 3 జిల్లాల్లో బంగాలీ అధికారిక భాషగా గుర్తింపు.
- 1971:
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంతో భారత్లోకి మరింత పెరిగిన శరణార్థుల రాక.
- 1978:
మంగల్దోయ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు. ఒక్కసారిగా పెరిగిన ఓటర్ల సంఖ్య. అక్రమ వలసదారులు ఓటరు జాబితాలో చోటు సంపాదించారని ఆందోళన వ్యక్తంచేస్తూ భారీ స్థాయిలో నిరసనలు.
- 1979 ఆగస్టు 26:
ఓటరు జాబితాలోని విదేశీయుల పేర్లు తొలిగించే వరకు 1979 పార్లమెంటు ఎన్నికలు నిలిపివేయాలని అఖిల అసోం విద్యార్థి సంఘం నేతృత్వంలో నిరసన. అలా ప్రారంభమైన 'అక్సోమ్(విదేశీ వ్యతిరేక) ఉద్యమం' 6ఏళ్లు సాగింది.
- 1979 డిసెంబర్:
అసోంలో ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన విధింపు. తర్వాత మరో మూడేళ్లు కొనసాగింపు.
- 1980 మే:
విదేశీ వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా అఖిల అసోం మైనార్టీ విద్యార్థి సంఘం ఏర్పాటు.
- 1983 ఫిబ్రవరి 18:
నిల్లీ(ప్రస్తుతం నౌగోంగ్ జిల్లా) సహా 14 గ్రామాలకు చెందిన 3 వేల మంది బంగాలీ ముస్లింలు 6 గంటల్లోనే ఊచకోత.
- 1983:
బహిష్కరణ పిలుపులు, నిరసనల మధ్యే అసోం శాసనసభ ఎన్నికలు నిర్వహణ.
- 1983 డిసెంబర్ 12:
అక్రమ వలసదారుల చట్టానికి ఆమోదం. 1966-71 మధ్య అసోం వచ్చినవారు రానున్న 10ఏళ్లపాటు ఓటు హక్కు కోల్పోతారని చట్టంలో స్పష్టీకరణ. 1971 మార్చి 24 అర్ధరాత్రికన్నా ముందే రాష్ట్రంలో అడుగుపెట్టామని నిరూపించుకోలేనివారిని గుర్తించి, విదేశీయులుగా ప్రకటించి, స్వదేశానికి పంపేయాలని తీర్మానం. ఇందుకోసం విదేశీయుల ట్రైబ్యునళ్లు ఏర్పాటు.
- 1985 ఆగస్టు 15:
అసోం ఉద్యమం ఫలితంగా కేంద్రం, రాష్ట్రం, అఖిల అసోం విద్యార్థి సంఘం, ఇతర అసామీ జాతీయవాద సంఘాల మధ్య కుదిరిన 'అసోం ఒప్పందం'. అందుకు అనుగుణంగా పౌరసత్వ చట్టంలో సవరణలు. వలసదారులు భారత్కు వచ్చిన తేదీని బట్టి 4 విభాగాలుగా వర్గీకరణ. పౌరసత్వం ఎవరికి ఇవ్వాలన్న అంశంపై స్పష్టమైన నిబంధనలు రూపకల్పన.
- 1997:
ఓటరు జాబితా పునఃపరిశీలన చేపట్టిన ఎన్నికల సంఘం. అసోంలోని 2.3 లక్షల మందిని డీ(డౌట్ఫుల్-అనుమానాస్పద) ఓటర్లుగా గుర్తించాలని ఆదేశం.
- 2003:
పౌరసత్వ చట్టానికి కీలక సవరణలు. భారతీయ పౌరులుగా ఎవరిని గుర్తించాలన్న అంశంపై మరింత స్పష్టత.
- 2005 జులై:
'అక్రమ వలసదారుల చట్టం-1983'ని కొట్టేసిన సుప్రీంకోర్టు. రాజ్యాంగ విరుద్ధం, అక్రమ వలసదారుల గుర్తింపులో ప్రధాన ఆటంకంగా అభివర్ణన.
- 2009 జులై:
ఓటరు జాబితాలో అక్రమ వలసదారులు పేర్లు తొలిగించి, పౌరుల జాబితా అప్డేట్ చేయాలని కోరుతూ 'అసోం పబ్లిక్ వర్క్స్'(ఏపీడబ్ల్యూ) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
- 2010 జూన్:
రెండు రెవెన్యూ జోన్ల పరిధిలో ఎన్ఆర్సీ కొత్త జాబితా రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. అఖిల అసోం మైనార్టీ విద్యార్థి సంఘం నిరసనలతో నిలిపివేత.
- 2011 జులై:
ఎన్ఆర్సీ కొత్త నిబంధనావళి రూపకల్పన కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.
- 2012 జులై:
మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు అసోం మంత్రిమండలి ఆమోదం.
- 2013 జులై:
ఎన్ఆర్సీ కొత్త నిబంధనావళిని కేంద్ర హోంశాఖకు సమర్పించిన అసోం ప్రభుత్వం.
- 2013 ఆగస్టు:
ఏపీడబ్ల్యూ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. ఎన్ఆర్సీ కొత్త జాబితా రూపొందించే ప్రక్రియ వేగవంతానికి ఆదేశం.
- 2013 అక్టోబరు:
సుప్రీం ఆదేశాల మేరకు ఎన్ఆర్సీ రాష్ట్ర సమన్వయకర్తగా ప్రతీక్ హజేలా నియామకం.
- 2013 డిసెంబర్:
ఎన్ఆర్సీ అప్డేట్ చేసేందుకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం.
- 2015 ఆగస్టు:
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్ఆర్సీ అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభం. జాబితాలో చోటు కోసం దరఖాస్తులకు ఆహ్వానం.
- 2016 జులై 19:
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు పార్లమెంటులో పౌరసత్వ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.
- 2017 డిసెంబర్ 31:
ఎన్ఆర్సీ తొలి ముసాయిదా ప్రచురణ. దరఖాస్తు చేసుకున్న 3.29కోట్ల మందిలో 1.9కోట్ల మందికి జాబితాలో చోటు.
- 2018 మే:
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో తీవ్ర నిరసనలు. రాష్ట్రంలో పర్యటించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ.
- 2018 జులై 30:
ఎన్ఆర్సీ తుది ముసాయిదా విడుదల. జాబితాలో 2.89కోట్ల మంది పేర్లు. 40లక్షల మందికి దక్కని చోటు.
- 2019 జనవరి 8:
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం.
- 2019 జులై 21:
ఎన్ఆర్సీ తుది ముసాయిదాలోని పేర్లు అన్నింటినీ పునఃపరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీడబ్ల్యూ. జాబితాలో ఒక మహిళ పేరు చేర్చేందుకు ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేసి, అరెస్టయిన నేపథ్యంలో వ్యాజ్యం.
- 2019 జూన్ 26:
ఎన్ఆర్సీ తుది ముసాయిదా పునఃపరిశీలన. మరో లక్షా 2 వేల 462 మందిని జాబితా నుంచి తొలిగింపు.
- 2019 జులై 19:
ఎన్ఆర్సీ తుది ముసాయిదా నమూనా పునఃపరిశీలనకు అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం, అసోం ప్రభుత్వం. జాబితాలో చోటు దక్కనివారు రాష్ట్రవ్యాప్తంగా 12.7% మంది ఉంటే... సరిహద్దు ప్రాంతాల్లో 7.7శాతం మాత్రమే ఉండడంపై ఆందోళన. ఎన్ఆర్సీ రూపకల్పనలో అక్రమాలు జరిగి ఉంటాయని కేంద్రం, అసోం ప్రభుత్వం అనుమానం.
- 2019 జులై 22:
కేంద్రం, అసోం ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. తుది జాబితా ప్రచురణకు ఆగస్టు 31వరకు గడువు పొడిగింపు. 80 లక్షల పేర్లను ఇప్పటికే పునఃపరిశీలించామన్న ఎన్ఆర్సీ సమన్వయకర్త నివేదిక ప్రస్తావన.
- 2019 ఆగస్టు 13:
ఎన్ఆర్సీ ప్రచురణ గడువు పొడిగించాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. తుది జాబితాను ఆన్లైన్లోనే విడుదల చేయాలని ఆదేశం.
- 2019 ఆగస్టు 31:
అసోం జాతీయ పౌర రిజిస్టర్ విడుదల!