ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఇదివరకే లోక్‌సభ ఆమోదం పొందిన ఎస్పీజీ బిల్లు.. ఇవాళ ఎగువ సభ గడప దాటింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
గాంధీ కుటుంబానికి ఇటీవలే ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
షా వివరణ...
ఎస్పీజీ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఏ ఒక్క కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకుని బిల్లు తీసుకురాలేదని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఒక్క గాంధీ కుటుంబానికి కాకుండా.. 130 కోట్ల భారతీయుల భద్రత తమకు ముఖ్యమని నొక్కి చెప్పారు కేంద్ర మంత్రి.
అప్పుడు మాట్లాడనివారు మాట్లాడుతున్నారా..?
'ప్రతీకారంతో భాజపా ఎలాంటి విధానాన్ని అవలంబించబోదని.. గతంలో కాంగ్రెస్ ఇలాంటివి చేసింది' అని ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు షా. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్, దేవేగౌడ సహా ఇటీవల మన్మోహన్ సింగ్‌కు భద్రత తగ్గించడంపై స్పందించని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఎస్పీజీ భద్రత ఒక్క ప్రధానికే చెందిందని.. ఏ ఇతర వ్యక్తులకు అవసరం లేదని పేర్కొన్నారు.
''సోనియా గాంధీ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఎస్పీజీ బిల్లును తీసుకువచ్చామని అంటున్నారు. అది నిజం కాదు. పాత చట్టం ప్రకారమే సోనియా గాంధీ కుటుంబానికి ఉన్న ముప్పును సమీక్షించి వారికి ఎస్పీజీని ఉపసంహరించారు. ఈ బిల్లుకు, సోనియా గాంధీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. భద్రత అనేది హోదాకు గుర్తు కాదు. ప్రధానమంత్రి కంటే సాధారణ మనిషికి కూడా ఒక్కోసారి ప్రమాదం ఉండవచ్చు. అయోధ్య ఉద్యమ సమయంలో వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్‌కు ప్రధాని కంటే ఎక్కువ ప్రమాదం ఉండేది. కానీ ఆయనకు ఎస్పీజీ భద్రతను కల్పించలేదు.''
- అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఆ ఘటన యాదృచ్ఛికం...
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇంటి వద్ద భద్రత లోపంపై అమిత్ షా స్పందించారు. ఆ ఘటన యాదృచ్ఛికమని, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు.
ఎస్పీజీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సభ్యులు.. షా వ్యాఖ్యలపై అసంతృప్తితో రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం బిల్లు ఎగువసభ ఆమోదం పొందింది.