లోక్‌సభలో సభ్యుల ప్రస్తుత సంఖ్య 543. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆ సంఖ్యను 1977లో నిర్ణయించారు. ఆనాడు దేశ జనాభా కేవలం 55 కోట్లు. అదిప్పుడు 130 కోట్లకు పెరిగింది. ఒక్కో లోక్‌సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య గణనీయంగా విస్తరించడంతో సరైన స్థాయిలో ప్రజల ఆకాంక్షలను తీర్చలేకపోతున్నారన్న భావన అధికమవుతోంది. మనదేశంతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న దేశాల్లోనూ ఎక్కువమంది పార్లమెంటు సభ్యులున్నారు. ఉదాహరణకు బ్రిటన్ పార్లమెంటులో 650 మంది సభ్యులున్నారు. కెనడా పార్లమెంటులో సభ్యుల సంఖ్య 443. అమెరికన్ కాంగ్రెస్‌లో సభ్యులు 535 మంది. భారత్‌తో పోలిస్తే ఈ దేశాల్లోనూ జనాభాకు, పార్లమెంటు సభ్యుల సంఖ్యకు మధ్య నిష్పత్తి మెరుగ్గా ఉండటం గమనార్హం.
పరిగణించాల్సిన అంశాలెన్నో...
వాస్తవానికి లోక్‌సభ సభ్యులు చట్టాలు మాత్రమే చేయాలి. కార్యనిర్వాహక వర్గం ఆ చట్టాలను అమలు పరచి, పాలన వ్యవహారాలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, మనదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్వభావం- సిద్ధాంతాలకు, ఆచరణకు మధ్య పొంతన ఉండదు. చట్టసభల సభ్యులూ ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడంలో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయంతో పని చేస్తుంటారు. దీంతో ఒక నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యకు, సభ్యుల పనితీరుకు మధ్య తప్పనిసరిగా సంబంధం ఏర్పడుతోంది.
కొన్నిచోట్ల జనాభా బాగా పెరగ్గా, మరి కొన్నిచోట్ల ఆ స్థాయిలో జనాభా పెరుగుదల నమోదు కాలేదు. ఫలితంగా లోక్‌సభలో సభ్యులు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్యలో గణనీయమైన వ్యత్యాసం ఉంటోంది. రాజ్యసభలోనూ సభ్యుల సంఖ్యలో నాటి నుంచి పెద్దగా మార్పు లేదు. ఈ పరిస్థితిని ఇంకెంతో కాలం కొనసాగించలేమన్న భావన ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం లోక్‌సభ సీట్ల సంఖ్యను వెయ్యికి పెంచాలన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంతో ఈ అంశం విస్తృత చర్చకు కారణమైంది. భారత పార్లమెంటరీ వ్యవస్థ మరింత ప్రజాప్రాతినిధ్య స్వభావంతో పరిఢవిల్లేందుకు సీట్ల పెరుగుదల అత్యవసరమన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. అదే సమయంలో సభ్యుల సంఖ్య పెంపుదలలో ఉండే ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ఓ అభిప్రాయానికి రావలసి ఉంటుంది. ఇప్పటికే మన చట్టసభల్లో రణగొణధ్వనులు నిత్యకృత్యమయ్యాయి. చట్టాల్లోకాని, ప్రభుత్వ విధానాల్లోకాని నాణ్యత సన్నగిల్లింది. అనేకమంది సభ్యులు అసలు సభకే రాని దుస్థితి ఉంది. పలు సందర్భాల్లో కోరమ్ సైతం కరవవుతోంది. సభ్యుల్లో కొద్దిమంది మాత్రమే సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సభకు ఉంటున్న పరిమిత సమయంలో చాలామంది సభ్యులకు మాట్లాడే అవకాశమూ దక్కడంలేదు.
ఒకవేళ అవకాశం ఉన్నా అమెరికా ప్రజాస్వామ్యం తరహాలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకొనే అవకాశం మన పార్టీల వ్యవస్థ సభ్యులకు ఇవ్వడం లేదు. పార్లమెంటు సభ్యులు తమతమ పార్టీలకు బందీలవుతున్నారు. బహుపాక్షిక చర్చలకు చట్టసభల్లో అవకాశమే లేకుండా పోతోంది. చట్టసభలకు వచ్చేవారి ఉద్దేశాలే వేరుగా ఉంటున్నాయి. పార్లమెంటు చర్చల్లో పాల్గొనాలన్న దృక్పథంకన్నా తమ సొంత పనులు చక్కబెట్టుకోవడంపైనే వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి స్థితిలో లోక్‌సభలో ఎన్ని సీట్లు ఉంటే ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సభ్యుల సంఖ్యకన్నా పార్లమెంటు జరిగే తీరు, ప్రతిపక్షాల పట్ల అధికార పార్టీ అనుసరించే వైఖరి, సభను నడపడంలో ప్రభుత్వ బాధ్యతాయుత విధానంపై పార్లమెంటు సరళి ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాలూ తరచూ సభను ఎలా అడ్డుకోవాలనే ఆలోచిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సభ్యుల సంఖ్య వెయ్యికి పెరిగితే గందరగోళం ఇంకా అధికమవుతుందనేది విమర్శకుల వాదన.
సభ్యుల సంఖ్య వెయ్యి లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నా సభ నిర్వహణకు కొత్త విధానాలు అనుసరించడం ద్వారా మెరుగైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించవచ్ఛు ఉదాహరణకు పార్లమెంటరీ స్థాయీసంఘాల ఏర్పాటు పార్లమెంటరీ చరిత్రలో కీలక పరిణామం. పార్లమెంటరీ స్థాయీసంఘాలు వివిధ మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తాయి. ప్రతి పార్టీకి వారి వారి సంఖ్యను బట్టి ఈ సంఘాల్లో ప్రాతినిధ్యం ఉంటుంది. అందరికీ ఏదో ఓ సంఘంలో ప్రాతినిధ్యం ఉంటుంది. సభ్యుల అనుభవం ఆధారంగా వారు, వారి పార్టీలు ఈ సంఘాలను ఎంచుకోవచ్ఛు ఈ సంఘాలను ‘మినీ పార్లమెంటు’గా పిలుస్తారు. పార్లమెంటులో సభ్యులకు, మంత్రులకు మాత్రమే సంప్రతింపులుంటాయి. కానీ, ఈ స్థాయీసంఘాల సమావేశాలకు అధికారులూ రావడం వల్ల సభ్యులు మరింత మెరుగ్గా సమీక్షించేందుకు వీలు కలుగుతుంది. మీడియా సమక్షంలో ఇవి జరగవు కాబట్టి- పార్టీలు, సభ్యులు చౌకబారు ఎత్తుగడలు అనుసరించి ప్రచారానికి సభా సమయం వృథా చేయడం జరగదు.
అందువల్ల వెయ్యి, అంతకన్నా ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ మంత్రిత్వ శాఖల వారీగా ఏర్పడే పార్లమెంటరీ స్థాయీసంఘాల్లో ఎక్కువ మంది పాల్గొని చర్చలను సుసంపన్నం చేసేందుకు వీలు కలుగుతుంది. సభ్యుల సంఖ్య పెంచడం ద్వారా వారు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య మెరుగైన ప్రజాప్రాతినిధ్యం ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో ఈ స్థాయీసంఘాలు, పార్లమెంటరీ కమిటీల విధానాన్ని సమర్థంగా నిర్వహించేందుకు చాలినంత మంది సభ్యులూ అందుబాటులో ఉంటారు. సభ్యుల సంఖ్య పెంచాలనుకున్నప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని మన ఎన్నికల విధానంలో మౌలిక మార్పులు తెచ్చేందుకు ఉపక్రమించవచ్ఛు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో పార్టీలకొచ్చే ఓట్లకు, గెలిచే సీట్లకు ఎలాంటి సంబంధం ఉండటం లేదు. దీనిస్థానే దామాషా పద్ధతిని ప్రవేశపెట్టాలన్న డిమాండ్ ఉంది. ఈ రెండు పద్ధతుల్లోనూ మంచి చెడులున్నాయి. అందువల్ల మధ్యేమార్గంగా రెండింటినీ కలిపి అమలు చేయవచ్ఛు ప్రస్తుత విధానం, దామాషా విధానాలు రెండింటినీ అమలు చేసేందుకు సీట్ల సంఖ్య పెంచినప్పుడు మెరుగైన అవకాశం ఉంటుంది. వెయ్యి సీట్లకు పెంచినప్పుడు, అయిదు వందల సీట్లలో ప్రస్తుత ఎన్నికల విధానం ద్వారా నింపవచ్ఛు మిగిలిన అయిదు వందల సీట్లను దామాషా పద్ధతి ద్వారా ఎన్నుకోవచ్ఛు ఫలితంగా భారత ప్రజాస్వామ్యం మరింత సుసంపన్నం అవుతుంది.
తాజా జనాభా లెక్కలే కీలకం
భారత్‌లో ఓట్లకు, సీట్లకు సంబంధం లేకపోవడమే కాకుండా వివిధ ప్రాంతాల మధ్యా సీట్ల సంఖ్యలో భారీగా తేడా ఉంది. ఫలితంగా రాజకీయ అధికారంలోనూ ప్రాంతీయ తేడాలుంటున్నాయి. ఉదాహరణకు, దక్షిణ భారతదేశానికి ప్రస్తుతం లోక్‌సభలో 130 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందుకే దేశ రాజకీయాలపై ఉత్తరాది ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ సీట్లను 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్ధ.రించారు. ఇదే విధంగా ఆర్థిక సంఘమూ ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటోంది. గత 14వ ఆర్థిక సంఘం తొలిసారిగా కొంత వెయిటేజీని 2011 జనాభా లెక్కలకు ఇచ్చింది. ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, ముఖ్యంగా కేటాయింపులను సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధ సంస్థ. 1971 తరవాత దేశంలో జనాభా నియంత్రణ కార్యక్రమాలను పెద్దయెత్తున అమలు చేయడం మొదలైంది. జనాభా కూడా రాష్ట్రాలకు కేటాయింపులను నిర్ణయించేందుకు కీలకమైన కొలబద్ధ అందుకే జనాభాను సమర్థంగా అరికట్టిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు ఆర్థిక సంఘం సిఫార్సులకు, నియోజకవర్గాల నిర్ధరణకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాలు బాగా నష్టపోనున్నాయి. భవిష్యత్తులో నియోజక వర్గాల పునర్విభజన జరిగేటప్పుడూ 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకునే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా బాగా తగ్గుతుంది. అప్పుడు ఉన్నవాటినే జనాభా ఆధారంగా పునర్విభజించాల్సి ఉంటుంది. ఇందుకు తీవ్రమైన రాజకీయ ప్రతిఘటన వచ్చే అవకాశం ఉంది. ఇది గమనించే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచాలంటే- మొత్తం సీట్లను పెంచడం ఒక మార్గం. ఈ వ్యూహంతోనే నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారన్న అనుమానం లేకపోలేదు. సీట్లు పెంచినా ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకపోవచ్చు కానీ, రాజకీయ ప్రాతినిధ్యం తప్పనిసరిగా మందగిస్తుంది. లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలున్నాయి. లాభ నష్టాలనూ చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. సీట్ల పెంపుదలకు అసలు కారణాలను స్పష్టీకరించాలి. దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫ్రొఫెసర్ కే. నాగేశ్వర్