ప్రపంచంలో అత్యంత అందాల బామ్మ ఎవరు? ఈ ప్రశ్న విన్నప్పుడు కాస్త ఆశ్చర్యమేసిందా? 'అందాల భామల' గురించి విన్నాం కానీ.. 'అందాల బామ్మ' ఏంటీ అనుకుంటున్నారా?. గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన నీరూ రస్తోగి ఇటీవల 'ప్రపంచ అందాల బామ్మ' అవార్డును సొంతం చేసుకొన్నారు.
ఐరోపాలోని బల్గేరియాలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి వచ్చిన 38 మంది బామ్మలు పోటీలో పాల్గొన్నారు. పోటీలో నీరూ రస్తోగి... అమెరికా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన మహిళలను ఓడించి అందాల కిరీటం సొంతం చేసుకున్నారు.
ఎవరీ బామ్మ...
52 ఏళ్ల నీరూ రస్తోగికి ఇద్దరు కుమార్తెలు, ఒక మనవరాలు ఉన్నారు. అయినా అందానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడానికి దాదాపు 2 ఏళ్లు కష్టపడ్డారు.
2018లో గుజరాత్లో నిర్వహించిన 'గెలాక్సీ క్వీన్' పోటీల్లో తొలిసారి రన్నరప్‌గా నిలిచారు నీరూ. అక్కడి నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2020 జనవరిలో జరిగిన 'మిస్ క్లాసిక్ గెలాక్సీ ఇండియా 2019' పోటీల్లో కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం ఐరోపాలో జరిగిన ప్రపంచ అందాల పోటీలకు ఎంపికయ్యారు. గడ్డకట్టే ఆ చలిలో తన అందాలతో ప్రేక్షకులను మైమరపించారు నీరూ.
గతంలో నీరూకు ఐదు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని, అధిక వ్యాయామాలు చేయకూడదని వైద్యులు సూచించారు. విశ్రాంతి కాలం ముగిసిన అనంతరం.. జిమ్‌కు వెళ్లడం ప్రారంభించారు నీరూ. మధుమేహం ఉన్నప్పటికీ బరువు పెరగకుండా జాగ్రత్తలు వహించారు.
ఇదీ చూడండి: వినూత్నం: హాల్‌టికెట్ లాంటి పెండ్లిపత్రిక..!