మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ‘సాయి జన్మభూమి’ వివాదం మొదలయింది. సద్గురు సాయిబాబా జన్మస్థలం పర్భణీ జిల్లాకు చెందిన ‘పాథ్రీ’ అని స్థానికులు భావిస్తూ 1999లో శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తుండడం వల్ల ఆ పట్టణం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తరువాతే సాయి జన్మభూమి అంశంపై తెరపైకి వచ్చిందంటూ భాజపా విమర్శిస్తోంది. దీనిపై శిరిడీ వాసులు న్యాయపోరాటం చేస్తారని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఆధారాలున్నాయంటున్న ఎన్‌సీపీ ఎమ్మెల్యే...
సాయిబాబా జన్మించిన స్థలం పాథ్రీ అని నిరూపించడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఆ పట్టణవాసి అయిన ఎన్‌సీపీ ఎమ్మెల్యే దుర్రానీ అబ్దుల్లా ఖాన్ చెప్పారు. పాథ్రీయే సాయినాథుని జన్మస్థానమన్న అభిప్రాయాన్ని గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా సమ్మతించారన్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని శిరిడీ.. సాయిబాబా ‘కర్మ భూమి’ అయితే పాథ్రీ ఆయన ‘జన్మభూమి’ అని అన్నారు. పాథ్రీకి ప్రాధాన్యం లభిస్తే తమ క్షేత్ర ప్రాధాన్యం తగ్గుతుందని శిరిడీ వాసులు భయపడుతున్నారని చెప్పారు. అందుకే దీన్ని సాయిబాబా జన్మభూమిగా పిలవడానికి అంగీకరించడం లేదని అన్నారు. జన్మభూమి, కర్మభూమి రెండూ వేటికవే గొప్పవని అభిప్రాయపడ్డారు. పాథ్రీకి చాలా మంది భక్తులు వస్తున్నా పట్టణంలో కనీస సౌకర్యాలు లేవని అందుకే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని చెప్పారు.
నేతలు ఎలా నిర్ణయిస్తారు?: భాజపా
ఈ ప్రకటనపై భాజపా నాయకుడు, అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ స్పందించారు. శివసేన-ఎన్‌పీసీ-కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ వ్యవహారం ఆకస్మికంగా తెరపైకి వచ్చిందని విమర్శించారు. ‘‘సాయిబాబా జన్మస్థలంపై ఇంతవరకు వివాదం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పాథ్రీయే సాయి జన్మభూమి అనడానికి ఆధారాలు ఉన్నాయన్న వాదన వచ్చింది. సాయిబాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడూ నిర్ధరించలేరు. ఇలాంటి రాజకీయ జోక్యం కొనసాగితే శిరిడీ వాసులు న్యాయ పోరాటం చేస్తారు’’ అని చెప్పారు. తమ దృష్టిలో జన్మభూమి కన్నా కర్మభూమే గొప్పదన్నారు.
సౌకర్యాలిస్తే తప్పా: మంత్రి అశోక్ చవాన్
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ సమర్థించుకున్నారు. సాయి జన్మస్థాన్ మందిరానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. జన్మభూమిపై వివాదం సృష్టించి భక్తులకు సౌకర్యాలు అందకుండా చేయడం తగదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పౌర ఆందోళనల్లోనూ విదేశీ పర్యటకుల తాకిడి