అనేక దేశాలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసినా 2019లో భారత్‌లో పర్యటించిన విదేశీయుల సంఖ్య పెరిగిందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై కొందరు అసత్య ప్రచారం చేసేందుకు ప్రయత్నించినా అది విదేశీ పర్యటకులపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన స్పష్టం చేశారు.
గతేడాదితో పోలిస్తే 2019లో ఈ-వీసా పొందిన వారిలో 43 శాతం పెరుగుదల ఉందని, విదేశీ పర్యటకులు శాతం కూడా 8 శాతం పెరిగిందని ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. కొందరు దేశంలో పరిస్థితులపై ప్రణాళికబద్దంగా అసత్యాలు ప్రచారం చేశారని, కానీ వారి ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదనడానికి ఈ గణాంకాలే రుజువని మంత్రి వెల్లడించారు.
దేశం సుస్థిరంగా, శాంతియుతంగా ఉందన్నారు ప్రహ్లాద్ పటేల్. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వతా విదేశీ పర్యాటకులు సంఖ్య 4.3 శాతం పెరిగిందని పర్యటక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, పౌరచట్ట సవరణ అనంతరం చెలరేగిన ఆందోళనలతో భారత్‌లో పర్యటించే సమయంలో జాగ్రత్త వహించాలని పేర్కొంటూ పలు దేశాలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. అయినప్పటికీ పర్యటకుల సంఖ్య పెరిగిందని కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: 'ఏటా 5 విదేశీ కుటుంబాలను భారత్‌కు పంపండి'