సైన్యం అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
జమ్ముకశ్మీర్‌లో సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసులు చొరవతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో కూడిన కారును గుర్తించిన భద్రతా బలగాలు తగిన సమయంలో స్పందించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నిలువరించగలిగాయి.
తనిఖీలతో వెలుగులోకి
తీవ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారంతో పుల్వామా పోలీసులు వాహనాలు తనిఖీ చేసే కేంద్రం వద్ద రాత్రి ఒక తెల్ల కారును ఆపారు. పోలీసులను చూసిన డ్రైవర్.. మరింత వేగంగా ముందుకు కదిలాడు. వెంటనే కారుపై పోలీసులు, అక్కడే ఉన్న సైనికులు కాల్పులు జరిపారు. బలగాలు కారును వెంబడించగా కొంతదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. కారుకు ఐఈడీ అమర్చినట్లు గుర్తించిన సైనిక బలగాలు.. బాంబు నిర్వీర్య దళాలను రప్పించాయి. ముందు జాగ్రత్తగా కారు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఉదయం వరకూ వేచి చూసిన బాంబు నిర్వీర్యదళం... కారును అక్కడి నుంచి తరలిస్తే ప్రమాదమని ఈ ఉదయం అక్కడే పేల్చి వేసింది.