దిల్లీ జామియా విశ్వవిద్యాలయంలో తుపాకీతో ఓ వ్యక్తి కలకలం రేపిన ఘటనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
"ఈ ఘటనపై దిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడా. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాను."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
గురువారం మధ్యాహ్నం జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. సీఏఏ నిరసనకారులపై ఆ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మిగిలిన వారు అతడిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ విద్యార్థికి చికిత్స అందిస్తున్నట్టు... అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని అధికారులు తెలిపారు.
ఆ దుండగుడు మైనర్...!
తుపాకీతో దాడికి తెగబడ్డ దుండగుడు మైనర్ అని తెలుస్తోంది. అతడి వయస్సుకు సంబంధించిన సీబీఎస్ఈ మార్క్ షీట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
భారీ పోలీసు బలగం ఉన్నప్పటికీ.. 'ఇదిగో మీ స్వేచ్ఛా' అంటూ ఆగంతుకుడు తుపాకీతో దాడికి పాల్పడ్డాడు. అంతకు కొద్ది సేపటి ముందు 'షహీన్‌బాగ్ ఖేల్ ఖతమ్(షహీన్‌బాగ్ పని అయిపోయింది)' అని ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
వర్సిటీలో ఉద్రిక్తం...
మరోవైపు విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన అనంతరం విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో నిరసనకారులు భారీగా గుమిగుడారు. బారికేడ్లను తోసుకొచ్చి పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
శాంతియుతంగా సాగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడం వల్ల నిరసనకారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అహింసను ప్రోత్సహించిన మహాత్మా గాంధీ వర్ధంతి రోజే హింస నెలకొనడం ఎంతో విషాదకరమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:- బూతు బొమ్మలు చూసినందుకు యువకుడు అరెస్ట్