అంతర్జాలంలో చైల్డ్ పోర్న్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. చిన్న పిల్లలతో కూడిన అశ్లీల దృశ్యాల సృష్టికర్తలే కాదు.. వీక్షకులపైనా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తమిళనాడు చెన్నైకు చెందిన 24 ఏళ్ల ఓ యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అంబత్తూర్‌కు చెందిన హరీశ్.. నిషేధిత చైల్డ్ పోర్న్ దృశ్యాలు చూస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ అందించిన సమాచారం మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
చైల్డ్ పోర్న్‌పై కఠిన చర్యలు..
దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్న క్రమంలో అంతర్జాలంలో చైల్డ్ పోర్న్ అరికట్టేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. బాలలపై లైంగిక దాడుల నివారణ, దర్యాప్తు విభాగం.. ఓసీఎస్ఏఈ పేరిట దిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది.
సీబీఐ ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగం పరిధిలో ఓసీఎస్ఏఈ ఉంటుంది. చైల్డ్పోర్న్ను సృష్టించి, అంతర్జాలంలో వ్యాప్తి చేస్తున్న వారితో పాటు ఆ దృశ్యాల కోసం వెతుకుతున్న, డౌన్లోడ్ చేస్తున్న వారి వివరాలను సేకరిస్తుంది ఈ సంస్థ. చైల్డ్‌పోర్న్ సృష్టికర్తలు, వీక్షకులపై ఐపీసీ, పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు కానున్నాయి.
ఇదీ చూడండి: దుకాణంపై కిరోసిన్ బాంబు దాడి చేసిన దోపిడి ముఠా!