ఒడిశా కటక్‌లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది. సుమారు 22 రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. జగత్ సింగ్‌పుర్ జిల్లాలోని తిర్తోల్కు చెందిన బాలిక నెల రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి కటక్‌కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లాలనుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
బండిపై దింపుతానంటూ...
ఇంటికి వెళ్లాలి అనుకున్న అమ్మాయికి లిఫ్ట్ ఇస్తానంటూ నిందితుడు మోసగించాడు. సమీపంలోని కోళ్లఫారంకు తీసుకుని వెళ్లి 22 రోజులు పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు అధికారులు తెలిపారు. ఫారం దగ్గర కదలికలపై స్థానికులు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కాపాడారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి కోసం వెతుకుతున్నారు. బాలికను స్థానికంగా ఉండే అనాధాశ్రమానికి తరలించారు శిశు సంక్షేమశాఖ అధికారులు.
రాజకీయ రగడ..
వచ్చే నెలలో తిర్తోల్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయిలు పరిహారం ఇవ్వడమే కాకుండా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాయి.