ముంబయి దాదర్ రైల్వే స్టేషన్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకు అనుకోని సంఘటన ఎదురైంది. గురువారం రైలు ఫ్లాట్ ఫాంపైకి వచ్చిన క్రమంలో కుల్జీత్ సింగ్ మల్హోత్రా అనే టాక్సీ డ్రైవర్ తన కంపార్ట్మెంట్లోకి వచ్చి టాక్సీ కావాలా అని అడిగినట్లు పేర్కొన్నారు సుప్రియ. తాను రెండు సార్లు వద్దు అని చెప్పినప్పటికీ.. దారికి అడ్డుగా నిలబడి ఇష్టారీతిలో వ్యవహరించాడని ట్విట్టర్లో వెల్లడించారు.
ఇలాంటి ఘటనలపై రైల్వే శాఖ దృష్టిసారించాలని తన ట్వీట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు సుప్రియ.
కంపార్ట్మెంట్లోకి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఫోటో తీసి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సుప్రియ. అనంతరం ఆ డ్రైవర్‌ను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి జరిమానా విధించినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.
టాక్సీ డ్రైవర్‌పై చర్యలు...
టాక్సీ డ్రైవర్ మల్హోత్రాపై భారతీయ రైల్వే చట్టం-1989 ప్రకారం సెక్షన్ 145బి, 147, 159ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. టికెట్ లేకుండా రైల్వే ఫ్లాట్ఫాంపైకి వచ్చినందుకు రూ.260 జరిమానా విధించినట్లు చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.200, యూనిఫాం లేనందుకు రూ.200 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 2022 పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో!