నిర్భయ ఘటన నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. 2017లో తనకు మరణశిక్ష విధించిన తీర్పును పునఃసమీక్షించాలన్న సింగ్ వ్యాజ్యాన్ని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. సింగ్ రివ్యూ పిటిషన్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి వాదనలు కూడా విననుంది సుప్రీం.
నిర్భయ ఘటనలో నిందితులైన ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. తాజాగా మరో నిందితుడైన అక్షయ్ కుమార్ సింగ్.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ సుప్రీంను ఆశ్రయించాడు.
మొత్తం ఆరుగురు..
2012 డిసెంబరు 16న అర్ధరాత్రి దక్షిణ దిల్లీలో 23 ఏళ్ల ఓ విద్యార్థినిపై ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు మొత్తం ఆరుగురు కిరాతకానికి తెగించారు. కదిలే బస్సులోనే ఆ యువతిని అత్యాచారం చేసి అనంతరం బస్సు నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ విద్యార్థిని.. అదే ఏడాది డిసెంబరు 29న సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
ముగ్గురి వ్యాజ్యాలు తిరస్కరణ
ఈ ఆరుగురు నిందితుల్లో ఒకడైన రామ్‌సింగ్ తిహాడ్ కారాగారంలో ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇంకొకడు మైనర్ అయినందున మూడేళ్ల మాత్రమే శిక్ష విధించారు. మిగతా నలుగురికి మరణశిక్ష విధిస్తూ దిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టు తీర్పునిచ్చాయి. దీనిపై 2017లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ముగ్గురు నిందితుల పిటిషన్లను తోసిపుచ్చింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్‌ను విచారించనుంది.