అయోధ్య కేసులో సుప్రీంతీర్పుపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయకూడదని సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు నిర్ణయించింది. మసీదు నిర్మాణానికి కేటాయించదలచిన ఐదు ఎకరాల భూమిని స్వీకరించాలా? వద్దా? అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
మెజారిటీ తీర్మానం..
"లఖ్‌నవూలో జరిగిన సమావేశానికి మొత్తం 8 మంది సభ్యులకుగాను ఏడుగురు హాజరయ్యారు. వీరిలో ఆరుగురు సుప్రీంతీర్పుపై సమీక్ష పిటిషన్ వేయకూడదని అభిప్రాయపడ్డారు. న్యాయవాది రబ్దుర్ రజాక్‌ఖాన్ మాత్రం సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలన్నారు. "
- జుఫర్ ఫారూకీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్
ఇంకా నిర్ణయించలేదు..
మసీదు నిర్మాణానికి కేటాయించదలచిన ఐదు ఎకరాల భూమిని స్వీకరించాలా లేదా అనే విషయంపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫారూకీ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఓ నిర్ణయానికి రావడానికి మరింత సమయం పడుతుందని, షరియత్ ప్రకారం ఇది సరైనదో, లేదో నిర్ధరించకోవాల్సి ఉందని చెప్పారు.
వివాదం ఇలా ముగిసింది..
దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న చారిత్రక తీర్పునిచ్చింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థాలాన్ని రామ్‌లల్లాకు కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డ్
అయోధ్యపై సుప్రీంతీర్పును సవాల్ చేస్తూ సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఇప్పటికే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటించింది. బాబ్రీ మసీదు స్థలానికి మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'బాధ్యతలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నం'