కరోనా తీవ్రత కారణంగా దేశంలో పాఠశాల బోధనా తీరు మారిపోయింది. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడగా... ఆన్‌లైన్ బోధన ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేదా టీవీల ద్వారా పిల్లలు తరగతులకు హాజరువుతున్నారు. కానీ..ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోలేని వలస కార్మికుల పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఇలాంటి పిల్లలకు బెంగళూరుకు చెందిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ స్వయంగా పాఠాలు బోధిస్తున్నారు.

బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరీ నగర్‌కు చెందిన శాంతప్ప జాదెమ్మనవర్ అనే ఎస్సై... వలస కార్మికులు ఉండే ప్రదేశానికి వెళ్లి... పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. రోడ్డు పక్కనే బోర్డు ఏర్పాటు చేసి పాఠాలు చెబుతున్నారు. వారికి పాఠ్యాంశాలతో పాటు యోగా, ఇతర విషయాలను చక్కగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు శాంతప్ప. ఆ పిల్లలతో పాటు కిందే కూర్చుని, వారితో ఆడుతూ విద్యాబోధన చేస్తున్నారు.


వలస కార్మికుల పిల్లలకు విలువలతో కూడిన విద్యనే తాను నేర్పిస్తున్నానని శాంతప్ప చెబుతున్నారు. ఖాళీ సమయంలోనే ఈ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.


"2005లో బెంగళూరుకు వచ్చినప్పుడు.. నేను కూడా మా బంధువులతో కలిసి వలస కార్మికుడిగా పనిచేశాను. మా బంధువులు దాదాపు పదేళ్లు వలస కార్మికులుగానే పని చేశారు. ఈ విధంగా వలస కార్మికులతో సత్సంబంధాలు ఉన్నాయి. మనం విద్యను అందించకపోతే... ఈ పిల్లల భవిష్యత్తు కూడా తల్లిదండ్రుల తరహాలోనే ఉంటుంది. ఈ పిల్లలు పనికి వెళ్లకూడదని నేను భావించాను. వారు విద్యను పొందాలి. అందుకే, నా వ్యక్తిగత సమయంలో వారికి విద్యనందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను."
-శాంతప్ప జాదెమ్మనవర్, సబ్‌ఇన్‌స్పెక్టర్
మొదట పిల్లలకు పాఠాలు చెబుతానంటూ వారి తల్లిదండ్రులను సంప్రదించినప్పుడు సరైన స్పందన రాలేదని శాంతప్ప తెలిపారు. ఆ తర్వాత కొందరిని ఒప్పించి చదువు చెబుతుంటే మిగతా వారు కూడా తమ పిల్లలను పంపడం ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తాను 9వ తరగతి పిల్లల వరకు చదువు చెబుతున్నానని.. పాఠాలతో సహా దేశ చరిత్రలో మరుగున పడిన వీరుల గాథలు వినిపిస్తున్నానని చెప్పారు.
శాంతప్ప కృషిని స్థానికులే కాకుండా నెటిజన్లూ ప్రశంసిస్తున్నారు.
ఇదీ చూడండి: భారత్‌పైనే ప్రపంచ దేశాల దృష్టి: మోదీ